Share News

Hyderabad IT Corridor Traffic: హైదరాబాద్‌లో మూడు రోడ్లు - ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:35 AM

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.

Hyderabad IT Corridor Traffic: హైదరాబాద్‌లో మూడు రోడ్లు - ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!
Hyderabad IT Corridor Traffic

హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 01: నగరంలో ఐటీ ఉద్యోగుల విలువైన సమయం రోడ్ల పాలవుతోంది. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఏ మార్గంలో వెళ్లాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లోనే వాహనాలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. రహదారుల విస్తరణ జరగకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలుగా అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటోంది.

కారిడార్ మీదుగా వెళ్లే మూడు ప్రధాన రహదారులే వీరికి ఆధారం. గచ్చిబౌలి ఔటర్‌రింగు రోడ్డు చౌరస్తా నుంచి కొండాపూర్, కొత్తగూడ మీదుగా హఫీజ్‌పేట వరకు ఉన్న పాత ముంబయి హైవే, రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, శిల్పారామం మీదుగా కేపీహెచ్బీ-జేఎన్టీయూ వరకు, కొత్తగూడ-కొండాపూర్ చౌరస్తా నుంచి హైటెక్స్ కూడలి, సైబర్ టవర్స్ మీదుగా మాదాపూర్-జూబ్లీహిల్స్ వరకు ఉన్న ఈ రోడ్ల మీదే వీరు ప్రయాణించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ కారిడార్‌లో రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ నరకం అంటే ఏమిటో కళ్లముందు కనిపిస్తుంది. అడుగులో అడుగు వేసినట్లుగా కదిలే వాహనాలతో గంటల తరబడి రోడ్లమీదే గడపాల్సి వస్తోంది.


రోడ్డు దాటడానికే ఫ్లైఓవర్లు!

ఐటీ కారిడార్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లు కొన్ని ఒక చౌరస్తా వద్ద రోడ్డు దాటడానికే అన్నట్లుగా మారాయి. గచ్చిబౌలి చౌరస్తాలో ఓఆర్ఆర్, కొండాపూర్ వైపు నిర్మించిన ఫ్లైఓవర్‌దీ అదే పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ దిగగానే నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. దీన్ని పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నవైపు నుంచి వచ్చే వాహనాలు వెళ్లేందుకు బారికేడ్లను ఏర్పాటుచేసి ఆపోజిట్ డైరెక్షన్ రోడ్డు మీదకు మళ్లిస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పోలీసులకు ఇదో పెద్ద టాస్క్‌గా మారింది. ఇదే పరిస్థితిని కొండాపూర్ నుంచి హఫీజ్‌పేట వెళ్లే ఫ్లైఓవర్ మీద కూడా కొనసాగిస్తున్నారు.


అక్రమ పార్కింగ్‌లు..

ఐటీ కారిడార్లో కేవలం ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలే కాకుండా రకరకాల వ్యాపార సంస్థలు పెద్దఎత్తున వెలిశాయి. ఇవన్నీ ప్రధాన రోడ్ల వెంటే ఏర్పాటుచేశారు. ఆయా వ్యాపార సంస్థలకు వచ్చే వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో రోడ్లమీదే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలకు అక్రమ పార్కింగ్‌లు అడ్డంకిగా మారి ట్రాఫిక్ జామ్‌కు దారితీస్తోంది. ఆకాశహర్మ్యాల భవనాలతోనూ ట్రాఫిక్ పెరిగింది. ఇక్కడ 30 అంతస్థుల నుంచి 40, 50, 60 అంతస్థుల వరకు భవనాలు నిర్మించుకునేలా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు ఇస్తుండటంతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది.


ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడం..

పది లక్షలకుపైగా ఐటీ ఉద్యోగులు పనిచేసే ఐటీ కారిడార్‌కు మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ఆర్టీసీ బస్సులూ అంతంత మాత్రంగా ఉండటంతో ఈ ప్రాంతానికి వచ్చే వారంతా ప్రైవేట్, సొంత వాహనాలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో రైలు సౌకర్యం ఉన్నా.. అది హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్ జంక్షన్ వరకే ఉంది. దీంతో రాయదుర్గం, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, పుప్పాల్‌గూడ ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు.


వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కొంత పరిష్కారం..

ట్రాఫిక్ జామ్ సమస్యకు పరిష్కారంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని రవాణారంగ నిపణులు సూచిస్తున్నారు. కరోనా సమయంలో 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేశారు. ఆ సమయంలో ఈ స్థాయిలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. ఆ తర్వాత కొన్ని మినహా మిగతా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎత్తివేస్తూ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని నిర్ణయించడంతో ట్రాఫిక్ ఇక్కట్లు భారీగా పెరిగాయి. తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.


ఇవీ చదవండి:

వణికిస్తున్న చలిగాలులతో బయటకు రాని జనం

ఒకరి తీర్పును మరొకరు కొట్టివేయడం ఆందోళనకరం

Updated Date - Dec 01 , 2025 | 12:36 PM