Share News

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం.. 30 ఏళ్ల కల సాకారం..

ABN , Publish Date - Mar 18 , 2025 | 06:28 PM

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిన్న వైద్యారోగ్య శాఖ మంత్రి బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ రోజు ఆ బిల్లును శాసన సభ ఆమోదించింది.

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం.. 30 ఏళ్ల కల సాకారం..
SC Classification Bill

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొప్ప విజయం లభించింది. ఇక, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటోంది. దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. బిల్లును ఎకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు నా కృతజ్ణతలు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషం’ అని అన్నారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో.. ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ణతలు తెలియజేశారు.


3 గ్రూపులుగా వర్గీకరణ..

రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ సిఫార్సు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించింది. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి జనాభా 3.288గా ఉంది. వీరికి 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. మధ్యస్థంగా లబ్ధిపొందిన 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. వీరి జనాభా 62.748గా ఉంది. వీరికి 9శాతం రిజర్వేషన్ కల్పించారు. కాస్త మెరుగైన ప్రయోజనాలు పొందిన 26 కులాలను గ్రూప్ 3లో వేశారు. వీరి జనాభా 33.963గా ఉంది. వీరికి 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఏ,బీ,సీ,డీ, కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణను చేసే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం.. కమిషన్ సిపార్సుతో పాటు ఎపిరికల్ డేటాను ద‌ృష్టిలో పెట్టుకుని న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది.


వర్గీకరణ ఎందు కోసం..

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 ఉండగా.. మాలలు 55,70,244 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం మాలల జనాభా కంటే మాదిగల జనాభా 11.3 లక్షలు ఎక్కువ. ఎస్సీల్లో కేవలం ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకు ఉంటుందని ఓ అంచనా. అందరికీ కలిపి 15 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం కోటాలో మాలలే ఎక్కువ లాభం పొందుతున్నారనే గొడవ దశాబ్దాల క్రితమే మొదలైంది. 1972 నుంచి మాదిగ వర్గానికి చెందిన నేతలు ముఖ్యమంత్రుల్ని కలుస్తూ వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. మందా క్రిష్ణ మాదిగ కూడా దీనిపై ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు..‘ 1996 నాటికి మాదిగలు 18 వేల ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80-90 శాతం నాల్గో తరగతి ఉద్యోగాలే. మరోవైపు, మాలలు అన్ని రకాలవీ కలిపి 72 వేల ఉద్యోగాల్లో ఉన్నారు’ అని అన్నారు.


ఇవీ చదవండి:

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎవ్వరినీ వదలం

నేను సీనియర్‌‌ను.. మీరు చెప్తే వినాలా: దానం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 06:43 PM