CM Revanth Reddy: హైదరాబాద్‌లో సఫ్రాన్ కొత్త సెంటర్.. తెలంగాణ వృద్ధికి మైలురాయన్న సీఎం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:15 AM
తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎమ్‌ఎస్‌ఎమ్ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 26: శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ (Safran) నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) సెంటర్‌ను ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సఫ్రాన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఇది భారతదేశంలో LEAP ఇంజిన్‌ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO)సెంటర్ అని తెలిపారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఇది స్థానిక ఎంఎస్ఎంఈలకు, ఇంజనీరింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఇవాళ సఫ్రాన్‌కు చెందిన ఎమ్88 మిలిటరీ ఇంజిన్ ఎమ్‌ఆర్‌వోకు కూడా శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఎమ్‌ఆర్‌వో భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్.. భారతదేశంలోని ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ అని పేర్కొన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయన్నారు. తమ ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఎమ్‌ఎస్‌ఎమ్ఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, సెజ్‌లు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయన్నారు. సఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సీఎం తెలిపారు.
భారతదేశంలోని ప్రముఖ ఎమ్‌ఆర్‌వో, ఏరో ఇంజిన్ హబ్‌లలో హైదరాబాద్ ఒకటన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఎగుమతులు గత ఏడాది రెట్టింపు అయ్యాయన్నారు. 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందిందని గుర్తు చేశారు. ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమని చెప్పుకొచ్చారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తెలంగాణ 100 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్‌లను (ఐటీఐఎస్) అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసిందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతోందన్నారు.
30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. తమ విజన్‌ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. బెంగళూరు-హైదరాబాద్‌ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాటు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
నర్సంపేటలో మందుబాబుల వీరంగం.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
శాలిబండ అగ్నిప్రమాదం... షాపు యజమాని మృతి
Read Latest Telangana News And Telugu News