Mahalakshmi Scheme: రికార్డు సృష్టించిన మహాలక్ష్మీ.. స్పందించిన మంత్రులు
ABN , Publish Date - Jul 23 , 2025 | 08:03 PM
మహిళల ఉచిత ప్రయాణం కోసం మహాలక్ష్మీ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం తాజాగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు స్పందించారు.

హైదరాబాద్, జులై 23: తెలంగాణలో మహాలక్ష్మీ పథకం మరో మైలు రాయిని చేరుకుంది. ఈ పథకంలో భాగంగా నేటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా స్పందించారు. అలాగే పలువురు మంత్రులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సుఖవంతంగా, సురక్షితంగా ప్రయాణిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం బస్టాండ్ వేదికగా మహాలక్ష్మి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ఉపయోగించుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు.
ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా సాక్షిగా మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణలో అమలు జరుపుతున్నామని వివరించారు. మహిళలందరూ ఎంతో సంతోషంగా.. ఎంతో ఆనందంగా ఉన్నారని తుమ్మల హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాదిలో రూ.6,700 కోట్లు మహాలక్ష్మి పథకానికి నిధులు కేటాయించామని తెలిపారు. ఆర్టీసీ మూతపడుతుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సంస్థను బతికించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ మహిళామణుల చిరునవ్వులే మాకు శ్రీరామ రక్ష అని అభివర్ణించారు. మహిళల దయ, ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఈ ఉచిత బస్సు పథకం అమలు చేయాలని చూస్తున్నారన్నారు.
రేవంత్ పాలన మాకు కావాలంటూ పక్క రాష్ట్రాల ప్రజలు సైతం కోరుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలు జరుపుతున్న పథకాలు.. ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం బస్టాండ్‌ను ఆదర్శవంతమైన బస్టాండ్‌గా నిర్మించేందుకు గతంలోనే ప్రణాళిక రూపొందించామని గుర్తు చేశారు. ఇక్కడే మల్టీ ఫ్లెక్స్‌లు, ఫుడ్ కోర్ట్‌లు ఉండేలా ప్రణాళిక రూపొందించి.. ఆనాటి ముఖ్యమంత్రిని తీసుకువచ్చి శంకుస్థాపన చేయించానన్నారు.
అలాగే గతంలో బైపాస్ నిర్మిస్తుంటే తనను హేళన చేశారని మంత్రి తుమ్మల చెప్పారు. ఈనాడు ఆ బైసాస్ రోడ్డే ప్రధాన రహదారిగా మారిందని వివరించారు. మున్నేటిపై రెండో బ్రిడ్జి నిర్మించామన్నారు. త్వరలోనే హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిని తలదన్నే విధంగా ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తున్నట్లు వివరించారు. అభివృద్ది చెందిన ఖమ్మంలో హిందు, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనేదే తన కోరికని ఆయన పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళల ప్రయాణం చేసే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసిందని గుర్తు చేశారు. మహిళలు డబ్బులు లేకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 661 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా.. పర్యాటక శాఖతోపాటు రాష్ట్రంలో ఆదాయ మార్గాలు సైతం పెరిగాయన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపీ మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు.
స్పందించిన మంత్రి పొన్నం..
మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా బస్సుల్లో వెళ్తున్నారన్నారు. ఉచిత బస్సు పథకాన్ని మహిళలు బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగాలు, దేవాలయాలు, షాపింగ్‌లకు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం పని చేస్తుందన్నారు. గత పదేళ్లలో ఆర్టీసీనీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
ఆర్టీసీ ఉంటుందా? అనే పరిస్థితులు కల్పించారంటూ బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వస్తోందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం.. నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. గత 10 సంవత్సరాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పైసలు వాడుకున్న పరిస్థితి ఉందని.. ప్రస్తుతం వారి డబ్బులు చెల్లిస్తున్నామని వివరించారు. సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమం నినాదంతో ఆర్టీసీ ముందుకుపోతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతోపాటు బస్సులకు యజమానులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం బస్సులను కొనుగోలు చేసిందని వివరించారు. ఇటీవల 150 బస్సులకి రూ.కోటి చెక్కులు సైతం అందజేశామన్నారు. గతంలో 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. 60 శాతమున్న ఆక్యుపెన్సి ఇప్పుడు 97 శాతంకి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్థిక విధ్వంసం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని పేర్కొన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీకి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించడం ద్వారా ఆర్టీసీకి రూ.6,680 ఆదాయం వచ్చిందన్నారు. దీంతో నేడు 97 బస్ డిపోలు, 324 బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందన..
ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.6,680 కోట్లు ఆదా చేసుకున్నారని.. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మునిగిపోతున్న పడవ ఎందుకు ఎక్కుతారని ఆ రోజు అన్నారని.. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని చెప్పారు.
మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ అని అభివర్ణించారు. 200 కోట్ల మహిళా ప్రయాణికుల ఛార్జీలు రూ.6,680 కోట్లు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. భవిషత్‌లో కూడా ఆ ఛార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. వచ్చిన ఆదాయం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 2,400 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా అడ్డుకొంటున్న కేంద్రం
Read latest Telangana News And Telugu News