Prakash Raj: ఈడీ అధికారులతో ముగిసిన ప్రకాష్ రాజ్ విచారణ
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:35 PM
బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. ఈ విచారణలో ప్రకాష్ రాజ్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది. ఆ యా ప్రశ్నలకు ప్రకాష్ రాజ్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

హైదరాబాద్, జులై 30: బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఆయన్ని ఈడీ అధికారులు విచారించారు. ఆ క్రమంలో ప్రకాష్ రాజ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. మరి ముఖ్యంగా జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేసిన వ్యవహారంపై ప్రకాష్ రాజ్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆ యాప్ ప్రమోషన్‌లో భారీగా ప్రకాష్ రాజ్ నగదు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ యాప్ ప్రమోషన్‌లో భాగంగా ఎంత నగదు వచ్చిందనే కోణంలో ఆయన్ని విచారించినట్లు తెలుస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా నగదు కూడా రాలేదని ఈ సందర్భంగా ఈడీ అధికారులకు ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే 2016లో జంగిల్ రమ్మీ యాప్‌ను తాను ప్రమోట్ చేశానని ఈడీ అధికారులకు ప్రకాష్ రాజ్ తెలిపారు.
కానీ జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్యంతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగ లేదని ఈడీ అధికారులకు ఆయన స్పష్టం చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. బెట్టింగ్ ఆడి ఎవరు మోసపోవద్దని ప్రజలకు ఆయన సూచించారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాష్ రాజ్‌కు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. అందులో భాగంగా దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకాష్ రాజ్ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.
ఆ దిశగా ఆయన్ని విచారించారు. దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌ను పలువురు ప్రముఖ నటుటు ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన నగదును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
అందులోభాగంగా గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రకాష్ రాజ్ స్టేట్‌మెంట్‌ను వారు పరిశీలించారు. అలాగే గతంలో జరిగిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై వారికి ప్రకాష్ రాజ్ స్పష్టత ఇచ్చారు. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తయ్యాక.. మళ్లీ రెన్యూవల్ చేయలేదని వారికి స్ప్టం చేశారు. అలాగే భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ఈడీ అధికారుల ఎదుట ప్రకాష్ రాజ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. రేవంత్ ప్రభుత్వం మరో కీలకనిర్ణయం.. వాటికి గ్రీన్ సిగ్నల్
సెప్టెంబర్ 9న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర
Read latest Telangana News And Telugu News