Sangareddy Sigachi Blast Incident: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్..
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:33 PM
సిగాచి ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని ఆ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని బాబూరావు తెలిపారు. అయితే, వాస్తవానికి 163 మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు.

హైదారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సిగాచి పరిశ్రమ ఘోర పేలుడు ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. సిగాచి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని న్యాయవాది కె.బాబూరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో సిగాచి పరిశ్రమ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని ఫిటిషన్‌లో పేర్కొన్నారు బాబూరావు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని స్పష్టం చేశారు. సిగాచి పరిశ్రమ యజమానిని ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని.. ప్రమాదంపై సీఎం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని పిటిషనర్ కోరారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని సిగాచి పరిశ్రమ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని ఆయన తెలిపారు. అయితే, వాస్తవానికి 163 మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు. గల్లంతైన 8 మంది కార్మికులకు సంబంధించి వారి మృతదేహాలు లభ్యం కానప్పటికీ వారిని మరణించిన వారి కిందనే ప్రకటించి పరిహారం అందించాలని కోరారు.
ఈ దుర్ఘటనలో బాధితులకు పూర్తి సత్వర న్యాయం జరగాలని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని కోర్టుకు కె.బాబూరావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారం విషయంలో క్లారిటీ లేదని, విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. కాగా, సిగాచి పరిశ్రమ ఘటన తెలంగాణ రాష్ట్రం వారికే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికుల కుటుంబాలకు కన్నీటి కథలను మిగిల్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
EX Minister KTR: రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే మాట మీద నిలబడాలి: కేటీఆర్
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫిటిషన్‌పై తీర్పు వాయిదా..