Hyderabad Metro: ఛార్జీలపై మెట్రో తాజా నిర్ణయం ఇదే
ABN , Publish Date - May 20 , 2025 | 03:31 PM
Hyderabad Metro: పెంచిన ధరలపై హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మెట్రో ఛార్జీలు పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

హైదరాబాద్, మే 20: మెట్రో ఛార్జీల విషయంలో ఎల్ అండ్ టీ సంస్థ దిగొచ్చింది. ప్రస్తుతం పెంచిన ఛార్జీలలో 10 శాతం రాయితీని ప్రకటిస్తూ ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ రాయితీలు వర్తించనున్నాయని సంస్థ ప్రకటించింది. కాగా.. మెట్రో కనీస ఛార్జీలు రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ఛార్జీలు రూ.60 నుంచి 75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ (Hyderabad Metro) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఛార్జీలు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచే కాకుండా ప్రతిపక్షాలు, వామపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా పెరిగిన మెట్రో ఛార్జీల విషయంలో ఆలోచించాలని ఎల్ అండ్ టీ సంస్థను కోరింది. ఈక్రమంలో ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను యాజమాన్యం సవరించింది. గత మూడు రోజులుగా పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ఛార్జీల మొత్తంపై పది శాతం రాయితీ ఉంటుందని ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించడంతో.. ప్రయాణికులకు కాస్త ఊరట లభించినట్లైంది. నిత్యం హైదరాబాద్ మెట్రో ద్వారా దాదాపు 5 నుంచి ఐదున్నర లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. దాంతో పెరిగిన ఛార్జీలు ప్రయాణికులపై అదనపు భారం పడినట్లైంది. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎల్ అండ్ టీ సంస్థ పెరిగిన ఛార్జీలపై పునరాలోచన చేసి.. పెంచిన ఛార్జీలపై పది శాతం రాయితీ ప్రకటించింది. మెట్రో సంస్థ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో మొత్తం మూడు కారిడార్‌లో ముఖ్యంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. అటు నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో కూడా విపరీతంగా రష్ ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో లాభాలు ఉన్నప్పటికీ జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గం మాత్రం పూర్తిగా నష్టాల బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో నష్టాల నుంచి గట్టెక్కేందుకు మాత్రమే ఛార్జీల పెంపు అనివార్యమైందే తప్ప ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం, ప్రయాణికులపై అదనపు భారం వేయడం తమ ఉద్దేశం కాదని మెట్రో సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను కూడా పరగిణలోకి తీసుకుని పెరిగిన ఛార్జీలపై దాదాపు పదిశాతం రాయితీ ఇస్తూ ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
Notice To KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
Raj Bhavan Theft Case: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో మలుపు
Read Latest Telangana News And Telugu News