Share News

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి

ABN , Publish Date - Jul 14 , 2025 | 09:54 AM

Swarnalatha Bhavishya Vani: బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నానని అన్నారు.

Swarnalatha Bhavishya Vani: నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి
Swarnalatha Bhavishya Vani

హైదరాబాద్, జులై 14: ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో (Ujjaini Mahakali Temple) ఈరోజు (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి (Swarnalatha Bhavishya Vani) వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తాను కోపంగా లేనని.. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.


బోనాలు సంతోషంగా అందుకున్నా..

‘నా భక్తులు సమర్పించిన బోనాలను సంతోషంగా అందుకున్నాను. కానీ ప్రతీ ఏడాది ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉన్నారు. ప్రతీ సంవత్సరం చెప్పినప్పటికీ నన్ను లెక్క చేయడం లేదు. ఏడాదికి ఏడాది నా కోరిక చెప్పినా నెరవేర్చడం లేదు. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. నా కోపానికి మీరు బలి అవుతారు.. కానీ నేను కోపం చూపించడం లేదు. నేను కన్నెర్ర చేస్తే మీరు రక్తం కక్కుకుని చస్తరు. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయి.. కాలం తీరిందంటే ఎవ్వరు ఏది అనుభవించాలో అది తప్పక అనుభవిస్తారు. నేను దానికి అడ్డురాను. వేల రాసులు నేను రప్పించుకుంటున్న... నాకు రక్తం బలి ఇవ్వడం లేదు.. మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు.. ఈ ఏడాది జరిపించకపోతే.. ఎవరెవరు అడ్డుపడుతారో వారిని రక్తం కక్కేలా చేస్తా. అందుకు నన్ను నిందించొద్దు. నన్ను కొలిచే వారు తప్పనిసరిగా విధివిధానంగా పూజలు జరిపించండి’ అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అయితే తల్లీ కోపం వద్దని.. సక్రమంగా పూజలు చేస్తామని ఆలయ పూజారులు అమ్మవారికి వాగ్దానం చేశారు.


రాబోయే రోజుల్లో..

‘అందరికీ తోడుగా నిలబడతా.. అందరినీ కాపాడుతా. నా రాష్ట్రాన్ని కానీ.. దేశాన్ని కానీ కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు పాటించాల్సినవి పాటించండి. అగ్నిప్రమాదాలు జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుంది.. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు తప్పకుండా కురుస్తాయి. పాడి పంటలను సమృద్ధిగా చూసే భారం నాది. భక్తులంతా ఐదు వారాలు పప్పు పలహారాలతో, కడివెడు సాక పోసి, పసుపు కుంకుమలతో నన్ను ఆనందపర్చండి. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను’ అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత చెప్పే భవిష్యవాణి కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.


రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పాల్గొన్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు జరుగనుంది. అలాగే సాయంత్రం పలమార బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి తెలంగాణకు 33ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మీని తీసుకువచ్చారు. అటవీ శాఖ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలతో ఈనెల 12వ తేదీన ఏనుగును అధికారులు తీసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..

ఈ మూడు అలవాట్లు పాటిస్తే చాలు.. వృద్ధాప్యం వచ్చినా పుష్టిగా ఉంటారు.!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 10:42 AM