Share News

KTR: నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:27 PM

కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

KTR: నేను ఇలానే మాట్లాడుతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్
KTR

హైదరాబాద్, నవంబర్ 29: కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని.. గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ... కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చెయ్యాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. నాయకుడిని నాయకుడే అంటారని.. అర్భకుడిని అర్భకుడే అంటారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడితే తనకు అహంకారం అంటారని.. కానీ తాను ఇలానే మాట్లాడుతానని.. ఏం చేసుకుంటారో చూసుకోండి అని అన్నారు.


కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష.. దొంగ దీక్ష అని మాట్లాడుతున్నారని.. అడ్డమైన మాటలు కొందరు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. సింహం తన గాధను తాను చెప్పుకోకపోతే, వేటగాడు చెప్పే పిట్టకథనే నిజం అనుకుంటారు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.


మహాభారతంలో పాండవులు హీరోలు.. విలన్లు కౌరవులు అని.. అలాగే రామాయణంలో హీరో శ్రీరాముడు... విలన్ రావణుడని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ కథలో హీరో ఉన్నాడు... శకునులు, మారీచులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. చరిత్రను మలుపు తిప్పిన రోజు కేసీఆర్ దీక్ష చేసిన రోజు అని చెప్పుకొచ్చారు. సచ్చుడో తెలంగాణ వచ్చాడో అన్న కేసీఆర్ నినాదం సునామీ సృష్టించిందన్నారు. కేసీఆర్ దీక్ష విఫలం కావాలని చాలా మంది ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరూ తుడిచివేయలేరని స్పష్టం చేశారు. టైం బాగాలేనప్పుడు గ్రామ సింహాలు కూడా పులుల్లా గర్జిస్తాయంటూ ఎద్దేవా చేశారు.


ఎన్నడూ జై తెలంగాణ అననోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మొదటి నుంచి విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైఎలక్షన్స్‌కు రావాలంటూ సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి సవాల్ విసిరారు. సోనియా గాంధీని బలిదేవత అన్నది ఇప్పుడున్న ముఖ్యమంత్రి అని గుర్తుచేశారు. సోనియా గాంధీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపిన సంస్కారి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ దొంగ దీక్ష అయితే ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విరమించమని చెప్పిందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుందామని దీక్షా దివస్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హీరోలను విలన్లుగా చిత్రీకరిస్తుందని విమర్శించారు. కాళేశ్వరం మీద కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను బాంబులు పెట్టి కూల్చివేసే ప్రయత్నం జరిగిందన్నారు. గులాంల ఎగురులాట కొంత కాలమే... వచ్చే కాలమంతా గులాబీలదే అంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

డాక్టర్‌ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.14 కోట్లు స్వాహా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 03:12 PM