Share News

KCR: అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:41 PM

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు , జగదీష్ రెడ్డితో ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదే అని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

KCR: అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సిద్దిపేట, ఆగస్టు 04: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికను పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ చేశారు. అదే సమయంలో మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడ వద్దని వారికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దామని పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నిర్మించారు. అయితే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగాయి. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అనంతరం ఈ ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


దాదాపు 15 నెలలపాటు ఈ కమిషన్ విచారణ జరిపింది. చివరకు జులై 31వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. ఆగస్టు 1వ తేదీన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ నివేదికపై ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆదివారం సమావేశమై.. చర్చింది.


ఈ కమిటీ అందించిన నివేదికపై తెలంగాణ సచివాలయంలో ఈ రోజు.. అంటే సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అదీకాక లక్షల కోట్ల రూపాయిలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ప్రాజెక్ట్‌కు కర్మ, కర్త, క్రియ అంతా కేసీఆర్ అని చెప్పకనే చెప్పింది.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ అగ్రనేతలో సమావేశమయ్యారు. దాదాపు ఆరు గంటలుగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, కేటిఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.


కేసీఆర్ యాగంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇంకోవైపు కేసీఆర్ యాగం చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు కేసీఆరే బాధ్యుడు..

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 05:06 PM