Hyderabad Gulzar House Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్.. క్షణ.. క్షణం హృదయవిదారకం
ABN , Publish Date - May 18 , 2025 | 05:38 PM
సెల్లార్ దగ్గరున్న కింద మెట్ల పక్కనే భారీగా మంటలు వస్తూ ఉండడంతో బయటికి వెళ్లలేక కుటుంబసభ్యులంతా టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో ప్రమాదం నుంచి ఇక, ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకపోయింది.

హైదరాబాద్: అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుని ఏకంగా 17 మంది ఊపిరాడక చనిపోయిన ఘటనలో పోలీసులు కూపీ లాగడం మొదలుపెట్టారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జర్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? అంత మంది ప్రాణాలెలా కోల్పోయారు? ప్రమాదానికి ముందు, ప్రమాదం తర్వాత ఏం జరిగింది? అనే అంశాలను ఇప్పుడు చిన్నగా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
మొదటగా, అగ్నిప్రమాద కారణాలను ఫైర్, పోలీస్ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రధాన రోడ్డుకు వెనక వైపు ఉన్న మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరగగా, మొదటగా సదరు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు మొదలయ్యాయి. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతోపాటు, ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అంటుకోవడంతో.. పై ఫ్లోర్‌లో ఉన్న వాళ్లంతా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కింద మెట్ల పక్కనే ఒక్కసారిగా మంటలు భారీగా వస్తుండడంతో బయటికి వెళ్లలేక కుటుంబసభ్యులంతా తీవ్ర ఇబ్బంది పడినట్లు సమాచారం. మరోవైపు, మంటలు ధాటి తట్టుకోలేక టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు బాధిత కుటుంబసభ్యులు. టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో ప్రమాదం నుంచి ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకపోయింది. మెట్ల పైభాగమైన టెర్రస్ దగ్గర మెట్ల గేటుకి తాళం వేసి ఉండటంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక్కసారిగా కిందికి వచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
హఠాత్తుగా మంటలు, పొగల్ని ఒక్కసారిగా చూసిన స్థానికులు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ కు కాల్ వెళ్లిన రెండు నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్‌తో అగ్నిమాపక బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది చిన్న మెట్ల ద్వారం గుండా లోపటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే, అవి.. టన్నెల్ లాంటి మెట్లు కావడంతో ఫైర్ సిబ్బందికీ తక్షణ సాయం చేయడానికి కొంత అవరోధం కలిగింది.
మెట్ల వద్ద వస్తున్న అగ్నికీలల్ని వెంటనే ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. మెట్ల నుంచి లోపలికి వెళ్లి 17 మందిని రెస్క్యూ చేశారు ఫైర్ బృందం. బిల్డింగ్ లోపల మొత్తం 21 మంది ఉన్నట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. 17 మంది అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గుర్తించిన ఫైర్ సిబ్బంది.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించారు. అయితే, వీరంతా విగత జీవులుగా మారిపోవడం అత్యంత దురదృష్టకరం. ఇందులో చిన్నచిన్న పిల్లలు, వృద్ధులు, యువతీ యువకులు కూడా ఉన్నారు.
అయితే, ఈ ప్రమాదం.. ఎవరైనా కావాలని చేసిన దుశ్చర్య ద్వారా మంటలు మొదలయ్యాయా?.. టెర్రస్ దగ్గర మెట్లకు తాళం వేయడంలో ఏమైనా కుట్రకోణం దాగుందా? అనే అంశాల్ని సైతం పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, ఈ ఘటన పై చాలా మందిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరైనా గిట్టనివాళ్లు.. ఆ కుటుంబానికి అపకారం చేయాలనే తలంపుతో ఇంత దారుణానికి తలపెట్టారా అన్నదీ చాలా మందిలో సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఈ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News
ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్థాన్