Telangana Reservations: రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్.. రేపు విచారణకు ఛాన్స్
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:47 AM
జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్, నవంబర్ 27: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టులో (Telangana High Court) మరోసారి పిటిషన్ దాఖలైంది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఎంపిరికల్ డేటా బహిర్గతం చేయకుండానే రిజర్వేషన్‌లు ఖరారు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రిజర్వేషన్‌లు ఇచ్చారు కానీ, రిపోర్ట్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేదని తెలిపారు. జీవో నెంబర్ 46లో బీసీలోని ఏ బీ సీ డీ లకు రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వలేదని పిటిషన్‌లో మచ్చదేవ్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను రద్దు చేయాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ మండిపడుతున్నారు. జీవో 46కు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద నిన్న (బుధవారం) బీసీ సంఘాల నేతలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అటు గాంధీ భవన్ ముట్టడికి కూడా బీసీ సంఘాలు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే జీవో 46ను రద్దు చేసి బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఫోకస్
Read Latest Telangana News And Telugu News