Share News

Harish Rao: ఆ రైతుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: హరీష్ రావు

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:25 PM

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటూ విమర్శలు గుప్పించారు.

Harish Rao: ఆ రైతుది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే: హరీష్ రావు
Harish Rao

హైదరాబాద్, డిసెంబర్ 1: కౌలు రైతుల రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. కౌలు రైతుల బతుకులకు భరోసా లేకుండా చేస్తోందంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో రైతు వీరన్న ఆత్మహత్యపై రియాక్ట్ అయిన మాజీ మంత్రి.. రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యే అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


హరీష్ ట్వీట్..

‘కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి, నేడు వారి బతుకులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం. వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్యనే. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు.

సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులెవరూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి... ఎవరూ అధైర్యపడకండి’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

హైదరాబాద్‌లో మూడు రోడ్లు - ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 12:41 PM