Share News

ED Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఈడీ చర్యలు.. ఐదుగురిపై మనీ లాండరింగ్ కేసు

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:57 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (HCA) ఆర్థిక అక్రమాలు ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారాయి. వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై తాజాగా కేసు నమోదు చేసింది.

ED Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఈడీ చర్యలు.. ఐదుగురిపై మనీ లాండరింగ్ కేసు
ED Hyderabad Cricket Association

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో జరిగిన ఆర్థిక అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ కేసులో HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అధ్యక్షురాలు కవిత యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్ల కింద నమోదైంది.


బీసీసీఐ నుంచి..

గతంలో HCAకు సంబంధించి నమోదైన రెండు కేసులను కలిపి ఈడీ కొత్త ECIRను రిజిస్టర్ చేసింది. బీసీసీఐ నుంచి HCAకు వచ్చిన నిధులలో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై లోతైన దర్యాప్తు చేపట్టేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు తెలంగాణ సీఐడీ కస్టడీలో ఉన్నారు. సీఐడీ విచారణ పూర్తయిన వెంటనే ఈడీ వారిని తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది.


ఆటగాళ్ల ఎంపికలో..

HCAలో జరిగిన ఆర్థిక అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, ఐపీఎల్ టికెట్ల అక్రమ విక్రయాలు, ఆటగాళ్ల ఎంపికలో అవకతవకలు వంటి ఆరోపణలు ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. జగన్‌మోహన్ రావు HCA అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని, శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను అక్రమంగా ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకుంది.


మరోవైపు ఇప్పటికే సీఐడీ..

సీఐడీ ఇప్పటికే నిందితులను ఆరు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతోంది. ఈ విచారణలో రూ.170 కోట్ల ఆర్థిక కుంభకోణం, ఐపీఎల్ 2025 సీజన్‌లో టికెట్ బ్లాక్‌మెయిల్, BCCI నిధుల దుర్వినియోగం వంటి కీలక విషయాలు బయటపడ్డాయి. ఈడీ ఈ విషయాలను మరింత లోతుగా పరిశీలించి, నిధుల గురించి పూర్తి వివరాలను సేకరించేందుకు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలను అందజేయాలని సీఐడీని కోరింది.


రాజకీయ నాయకులు కూడా..

HCAలో 2019 నుంచి 2022 వరకు జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని సీఐడీ, ఈడీని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోరింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈడీ ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ, నిందితుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ దర్యాప్తు ఫలితాలు HCAలో దీర్ఘకాలంగా జరుగుతున్న అవినీతిని బయటపెట్టే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

స్వచ్ఛ సర్వేక్షణ్‎ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 17 , 2025 | 08:07 PM