Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:51 PM
రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో. ఆలస్యం చేసినా ఆశాభంగం.. త్వరపడండి.. ఫాస్ట్ ఫాస్ట్..’’ అంటూ కేకలేస్తున్నంత పనిచేస్తోంది లండన్‌లోని బివొటిబి సంస్థ. ఈ కంపెనీ కొన్నేళ్ల నుంచీ ఖరీదైన ఇళ్లు, కార్లు, గడియారాలను వేలం వేస్తోంది.
- ఇళ్లనూ గెలుచుకోవచ్చు...
‘‘రండి బాబూ రండి.. చౌక ధర!. ఐదొందలు టికెట్ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో!!. ఆలస్యం చేసినా ఆశాభంగం.. త్వరపడండి.. ఫాస్ట్ ఫాస్ట్..’’ అంటూ కేకలేస్తున్నంత పనిచేస్తోంది లండన్‌లోని బివొటిబి సంస్థ. ఈ కంపెనీ కొన్నేళ్ల నుంచీ ఖరీదైన ఇళ్లు, కార్లు, గడియారాలను వేలం వేస్తోంది. అతి తక్కువ ధరకే టికెట్లను విక్రయించి.. తమ నుదుటిరాతను పరీక్షించుకోమంటున్న ఈ సంస్థ.. కొన్నేళ్ల నుంచీ అదృష్టజాతకుల తలరాత మారుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు రకాల లాటరీలు ఉన్నాయి.

అమెరికా, అరబ్ దేశాలతో మొదలై మన కేరళ వరకు ఇలాంటి ఎన్నో రకాల లాటరీలు సందడి చేస్తున్నాయి. లండన్‌లోని బివొటిబి సంస్థ కోట్ల రూపాయల్ని ఆర్జిస్తోంది. ఇళ్లను వేలం వేసే ధోరణి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారం. కొన్ని దేశాల్లో ప్రభుత్వ అనుమతి లేకపోయినాసరే.. ఈ తతంగం నడుస్తున్నది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు ఇళ్లను వేలానికి పెట్టడం విశేషం. మన దగ్గర ఇదొక కొత్త ధోరణిగా చెప్పుకోవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal, Yadadri Bhuvanagiri district)లోని ఒక ఇల్లు అమ్మకానికి పెడితే అంత త్వరగా కొనుగోలుదారులు రాలేదు.

యజమానికి ఒక ఐడియా వచ్చింది. అదే వేలానికి పెట్టడం. వెంటనే అనుకున్నది చేశాడు. ఐదొందల రూపాయల చొప్పున కూపన్లు విడుదల చేసి.. ఇంటిని వేలానికి పెట్టాడు. కూపన్ కొనుక్కున్న ఒక చిన్నారికి వేలంలో ఈ ఇల్లు తగిలింది. నల్లగొండలో కూడా ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. రూ.999 కూపన్‌తో ఇంటిని వేలానికి పెట్టారు. లాటరీ అనేది చట్టబద్దం కాకపోయినా కిందిస్థాయిలో నిర్వహించిన వ్యవహారం కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇలా మొదలైన ఈ ట్రెండ్.. భవిష్యత్తులో రియల్‌ఎస్టేట్ ఆశాజనకంగా లేనప్పుడు ఇళ్లను వేలం వేసే ట్రెండ్ మరింత విస్తరించే అవకాశం ఉంది.