Share News

NH 65: హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:28 AM

మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. జూన్‌ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని యోచిస్తోంది.

NH 65: హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

  • కిలోమీటరకు రూ.20 కోట్ల చొప్పున అవసరమని ఎన్‌హెచ్‌ఏఐ అంచనా

  • మే నెలాఖరుకు డీపీఆర్‌ పూర్తికి చర్యలు

  • ఆ వెంటనే అనుమతి తేవాలని యోచన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65)ని ఆరు లేన్లుగా విస్తరించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. కిలోమీటరుకు సుమారు రూ.20 కోట్ల చొప్పున 265 కిలోమీటర్లకు రూ.5,300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెల చివరి నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. జూన్‌ మొదటి వారంలో విస్తరణ పనులకు అవసరమైన అనుమతులను తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా డీపీఆర్‌ రూపొందించే పనిని దక్కించుకున్న భోపాల్‌కు చెందిన సంస్థతో ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులు సమీక్షిస్తున్నారు. గతంలోనే ఆరు లేన్లకు సరిపడా భూమిని సేకరించారు. దాంతో ఇప్పుడు భూ సేకరణ చేయాల్సిన అవసరంలేదు. అయితే విస్తరణకు సాంకేతికంగా కొన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయాలి.


అందుకోసమే డీపీఆర్‌ను రూపొందించనున్నారు. హైదరాబాద్‌ అవతల దండు మల్కాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లపూడి వరకు దాదాపు 265 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. మార్గమధ్యలో కొన్నిచోట్ల వెహికల్‌ అండర్‌ పాస్‌లు (వీయూపీలు), రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌వోబీలు), బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌ రోడ్డు దగ్గర వీయూపీ నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ ఓపెన్‌ జంక్షన్‌ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రామాపురం దగ్గర్లో సిమెంటు ఫ్యాక్టరీలు ఉండడంతో లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందువల్ల వీయూపీ నిర్మించనున్నారు. ఆ జంక్షన్‌కు దగ్గర్లో పాలేరువాగు ప్రవహిస్తోంది. దానిపై ఉన్న బ్రిడ్జి ఇటీవల వర్షాలకు దెబ్బతినగా, మరమ్మతులు చేశారు. దానికి పక్కనే కొత్త బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇవికాకుండా మిగతాచోట్ల ఎక్కడెక్కడ వీయూపీలు, ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు నిర్మించాలనే అంశంపై కూడా అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు 50 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - Apr 29 , 2025 | 05:28 AM