Share News

CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:38 AM

హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఎకో టౌన్‌

  • జపాన్‌లోని కిటాక్యుషు మాదిరిగా భాగ్యనగరం

  • భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం

  • పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: రేవంత్‌

  • కిటాక్యుషు నగరాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి

  • జపాన్‌ సంస్థలతో తెలంగాణ సర్కారు ఒప్పందం

  • హైదరాబాద్‌లో జపనీస్‌ పాఠశాల ఏర్పాటు యోచన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదని, అవసరమని అన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితోపాటు పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జపాన్‌ పర్యటనలో భాగంగా సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణహిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌ రంగాల్లో భాగస్వామ్యం పంచుకోనుంది. కాగా, కిటాక్యుషు నగర మేయర్‌ కజుహిసా టేకుచితో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునరుజ్జీవ విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఈఎక్స్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పీ9 ఎల్‌ఎల్సీ, నిప్పాన్‌ స్టీల్‌ ఇంజనీరింగ్‌, న్యూ కెమికల్‌ ట్రేడింగ్‌, అమితా హోల్డింగ్స్‌ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌పై తెలంగాణ ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యుషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యూషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్‌ టేకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.


పెట్టుబడులకు అనువైన వాతావరణం..

పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా వృద్ధి చెందిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితోపాటు తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన జపాన్‌ కంపెనీల పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌- కిటాక్యుషు నగరాల మధ్య విమాన ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయాలనే అంశం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో జపనీస్‌ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జపాన్‌లో యువశక్తి అవసరం ఎక్కువగా ఉందని, మన యువతకు జపనీస్‌ భాషపై నైపుణ్యం కల్పిస్తే.. అంతర్జాతీయంగా వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం మురాసాకి పునరుజ్జీవ ప్రాజెక్టును సందర్శించింది. గతంలో కాలుష్య కాసారంగా ఉన్న ఈ నది.. పరిశుభ్రమైన నదీతీరంగా మారిన తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతకుముందు సీఎం రేవంత్‌ బృందానికి కిటాక్యుషులో స్థానిక సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది.


నిర్బంధం బద్దలైంది.. ఇంద్రవెల్లి రెక్కలు విప్పుకొంది: రేవంత్‌

జల్‌.. జంగిల్‌.. జమీన్‌ అంటూ హక్కుల కోసం పోరాడి, అసువులు బాసిన అడవి బిడ్డలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. వారి పోరాటం సదా స్ఫూర్తిదాయకమన్నారు. ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినం సందర్భంగా ఆయన ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘నాలుగు దశాబ్దాల నిర్బంధం బద్దలైంది. ఇంద్రవెల్లి స్వేచ్ఛగా రెక్కలు విప్పుకొంది. నాకు అండగా నిలిచి.. ఇంద్రవెల్లి కొండల్లో దండోరా మోగించిన ఆదివాసీలకు అన్నగా, ఆత్మీయులకు దన్నుగా తీసుకున్న నిర్ణయం స్వేచ్ఛ’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 03:38 AM