Swachh Survekshan 2024-25: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ ఘనత
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:31 AM
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది.

ఢిల్లీలో అవార్డు స్వీకరించిన అధికారులు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మొదటి ర్యాంకు
న్యూఢిల్లీ, హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, జూలై 17: స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో 10 లక్షలకుపైగా జనాభా గల నగరాల కేటగిరీలో హైదరాబాద్ జాతీయస్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. సర్వే ప్రారంభించిన తొమ్మిదేళ్లలో ఇంత మెరుగైన ర్యాంకు సాధించడం ఇదే ప్రథమం. వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో భాగ్యనగరానికి సెవెన్ స్టార్ రేటింగ్ దక్కింది. గతేడాది తొమ్మిదో ర్యాంకు, ఫైవ్ స్టార్ ర్యాంకు రాగా.. ఈ సారి మెరుగైన ర్యాంకు, స్టార్ రేటింగ్ దక్కాయి. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా పురపాలక శాఖ కార్యదర్శి కే ఇలంబరిది, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎంవీ కర్ణన్ అవార్డు అందుకున్నారు.
పారిశుధ్య నిర్వహణలో దేశంలోని మొత్తం 58 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మొదటి ర్యాంకు దక్కింది. పారిశుధ్య నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ పనితీరుకుగాను ప్రత్యేక కేటగిరీ కింద ఈ అవార్డు దక్కింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో భోపాల్, లక్నో చోటు సంపాదించుకున్నాయి. శుభ్రత పాటించే నగరాలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ర్యాంకింగ్ విధానం ప్రకారం సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ కేటగిరిలో అత్యంత శుభ్రమైన నగరంగా నోయిడా నిలిచింది. ఇదే జాబితాలో ఇండోర్, సూరత్, నవీ ముంబై, విజయవాడ చోటు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి