Organic Farming Residential Schools: వసతి గృహాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:46 AM
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విద్యార్థులకు తాజా కూరగాయలతో భోజనం అందించేందుకే
మిద్దెతోట సాగు, కిచెన్ గార్డెన్‌పై సంకల్ప్ ఫౌండేషన్ శిక్షణ
పైలట్ ప్రాజెక్టుగా షేక్‌పేట్, ములుగనూర్ పాఠశాలల ఎంపిక
త్వరలో జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో అమలుకు చర్యలు
హైదరాబాద్ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులకు కలుషిత, రసాయన అవశేషాలతో కూడిన కూరగాయలకు బదులు.. తాజా కూరగాయలతో చక్కని భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అక్కడి ప్రాంగణాల్లో పండించడమో, మిద్దెసాగు విధానంలో పండించడమో చేయనున్నారు. ఇందుకు.. ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలోని షేక్‌పేట్ బాలుర సాంఘిక సంక్షేమశాఖ ఉన్నత పాఠశాల, హయత్‌నగర్ పరిధిలోని ములుగనూర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను ఎంపిక చేశారు. అనంతరం జిల్లాలోని ఇతర వసతి గృహాల్లో కార్యక్రమాన్ని చేపడతారు. ఈ విధానంతో రసాయనరహిత కూరగాయలను అందిచండంతోపాటు సిబ్బందికి, విద్యార్థులకు సేంద్రియ పంటలపై అవగాహన కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌కు శివారు ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కూరగాయల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయన్న అభిప్రాయాలున్నాయి. ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్లలో కొందరు నాసిరకం కూరగాయలు తీసుకొచ్చి వంటలను తయారు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిద్దెతోట కార్యక్రమంలో భాగంగా టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్‌ను అభివృద్ధి చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ అధికారులు ముందుకుసాగుతున్నారు.
టమాటాలు, కొత్తమీర, పుదీనా..
సేంద్రియ సాగు విధానంపై రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. త్వరలో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్‌లో సేంద్రియ సాగు విధానంపై అవగాహన కల్పించనున్నారు. అయితే కూరగాయల సాగుకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం లేదని, ఆయా చోట్ల పనిచేసే వంట మనుషులు, క్లీనింగ్ స్టాఫ్‌తో చేయించవచ్చునని అధికారులు చెబుతున్నారు. తొలుత టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర, గోంగూర, పచ్చిమిర్చి లాంటి విత్తనాలను వేసి పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్స్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడంలో భాగంగా వంట మనుషులకు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆధ్వర్యంలో శిక్షణనిప్పిస్తున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాలు తయారు చేయడంపై, వంట గదులు, వంటపాత్రల శుభ్రతపై ఇటీవల అవగాహన కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News