Share News

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

ABN , Publish Date - Nov 28 , 2025 | 08:15 AM

హైదరాబాద్‌ మెట్రో రైల్.. శుక్రవారం నాటికి ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 57 మెట్రోస్టేషన్లతో.. ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణస్తున్నారు. అయితే... పెరిగిన అవసరాల నేపధ్యంలో ఈ మెట్రో రైళ్ల సేలలను ఇంకా విస్తరింపజేయాల్సిన అంసరం ఉంది.

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

- నగరవాసులను అలరిస్తున్న మెట్రో రైళ్లు

- వేగవంతమైన ప్రయాణ సౌకర్యం

- 2017 నవంబర్‌ 28న ప్రారంభం

- అప్పటి నుంచి నిరంతరాయంగా సేవలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మెట్రో రైలు ప్రయాణం సదా మీ సేవలో అంటూ ముందుకు సాగిపోతోంది. సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ నగరవాసులను అక్కున చేర్చుకుని దినదిన ప్రవర్థ మానంగా వెలుగొందుతోంది. ఏడేళ్లు పూర్తి చేసుకుని శుక్రవారం ఎనిమిదో ఏటా అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

నగరంలో ట్రాఫిక్‌ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2012లో ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్‌- రాయదుర్గం కారిడార్లలో రూ.14,132 కోట్ల వ్యయంతో 72 కి.మీ. మేర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో మతపరమైన కట్టడాలు అడ్డుగా ఉన్న కారణంగా కారిడార్‌-2ను జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల పరిధిలో రైళ్లు నడుస్తున్నాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11.15 గంటల వరకు నిర్విరామంగా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలకు మెట్రో రైలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తోంది.


51.5 శాతం మంది ఉద్యోగులు

ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోల్‌-రాయదుర్గ్‌ కారిడార్లలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు బోగీల్లో కాలుపెట్టని పరిస్థితి నెలకొంటుంది. కాగా, రోజువారీగా ప్రయాణిస్తున్న సుమారు 4.80 లక్షల మందిలో 51.5 శాతం మంది ఉద్యోగులే ఉన్నట్లు ఇటీవల ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ట్విటర్‌ (ఎక్స్‌)లో నిర్వహించిన పోల్‌ ద్వారా వెల్లడించింది. గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు 30.3 శాతం, కాలేజీ, పాఠశాలలకు వెళ్లేందుకు 6.1 శాతం మంది ఉన్నారని, మిగతా 12.1 శాతం స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు మెట్రో వేగవంతమైన ప్రయాణ సాధనంగా ఉపయోగపడుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. కాగా, 2017 నవంబరు 29 నుంచి ఈ ఏడాది నవంబరు 26 వరకు సుమారు 80.21 కోట్ల మంది ప్రయాణం చేసినట్లు తెలిసింది.


city4.2.jpg

రెండో దశతో మరింత ఆకర్షణ...

నగరంలో మెట్రో రైలు రవాణాను మరింతగా విస్తరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు పార్ట్‌-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్‌-బీ కింద 3కారిడార్లను చేపడుతోంది. మొత్తం 8 కారిడార్లలో 163 కిలోమీటర్లను రూ.43,848 కోట్ల వ్యయంతో ప్రతిపాదించారు. వీటికి సంబంధించిన డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చిలోగా వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) అధికారులు చెబుతున్నారు. కాగా, రెండో దశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మహానగరంలో మెట్రోకు మరింత కీర్తి లభించనుంది.


ఇదీ లెక్క...

- మొత్తం మెట్రోస్టేషన్లు 57

- రోజువారీగా తిరిగే ట్రిప్పులు 1,100

- ప్రయాణికులు: 4.60 లక్షల నుంచి 4.80 లక్షలు

- కిలోమీటర్లు: 25,000

- ఇప్పటివరకు ప్రయాణించిన వారు: 80.21 కోట్లు

- మెట్రో, ఎల్‌అండ్‌టీ సాధించిన అవార్డులు : 205


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 08:15 AM