Share News

Hyderabad: నేడే హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:59 AM

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి తెలిపారు.

Hyderabad: నేడే హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక

ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌.. మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే చెల్లుబాటు

  • పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాం

  • రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి

  • బీఆర్‌ఎ్‌సపై ఈసీకి ఎఫ్‌జీజీ ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి తెలిపారు. 31 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యుల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలోని భవన నిర్వహణ విభాగం గదిలో, 81 మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్‌లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన దృష్ట్యా.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, అందుకే కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు సెలవు ఇచ్చామని పేర్కొన్నారు. దీనికి బదులుగా జూన్‌ 14 రెండో శనివారం పని దినంగా పరిగణిస్తామని ప్రకటించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఈఆర్‌వో) మంగతాయారుతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను అనురాగ్‌ జయంతి వివరించారు. పోలింగ్‌లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటవుతుందని తెలిపారు. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందినవారు విజేతగా నిలుస్తారని చెప్పారు. 25 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.


బీజేపీకి ఓటు వేయకుంటే హిందువులు మిమ్మల్ని క్షమించరంటూ ఓటర్లనుద్దేశించి పలు ప్రాంతాల్లో అంటించిన పోస్టర్లను తొలగించామని రిటర్నింగ్‌ అధికారి అనురాగ్‌ జయంతి తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటు వేయొద్దని, విప్‌ జారీ చేస్తామని, ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ అనడం, హిందుత్వవాదులంతా బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అనడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆయా విషయాల్లో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఆయన సమాధానమిచ్చారు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అందరూ వినియోగించుకోవాలని సెక్షన్‌ 123 చెబుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ బీఆర్‌ఎస్‌ తన కార్పొరేటర్లకు ఆదేశాలు జారీ చేయడంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం ఈసీ కార్యాలయానికి లేఖ రాశారు.


కట్టుబడి ఉంటారా? కట్టు దాటుతారా?

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించిన నేపథ్యంలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని మొత్తం 112 ఓట్లకుగాను ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్‌ఎ్‌సకు 24, కాంగ్రె్‌సకు 14 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ తమ ఓటర్ల విషయంలో ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే ఉండగా.. గెలుపు కోసం రెండు పార్టీలూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల బలం ఎక్కువగా ఉన్నా.. తమ ప్రజాప్రతినిధులు కట్టు తప్పకుండా ఎంఐఎం కట్టడి చేస్తోంది. మరోవైపు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కొందరు బీఆర్‌ఎస్‌ ఓటర్లకు హామీ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌కు దూరంగా ఉంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రె్‌సకు సంబంధించి హైదారాబాద్‌ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం ఉదయం ఆ పార్టీ ఓట్లతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు.

Updated Date - Apr 23 , 2025 | 04:59 AM