Share News

Hyderabad: వైభవంగా ప్రారంభమైన బోనాలు.. కిక్కిరిసిన కోట

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:33 AM

గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలతో, ఊరేగింపులతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో కోట హోరెత్తింది. ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.

Hyderabad: వైభవంగా ప్రారంభమైన బోనాలు.. కిక్కిరిసిన కోట

- తొలిరోజే రెండు లక్షల మంది భక్తులు.. పట్టువస్ర్తాలు సమర్పించిన స్పీకర్‌, మంత్రులు

హైదరాబాద్: గోల్కొండ కోట(Golconda Fort)లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలతో, ఊరేగింపులతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో కోట హోరెత్తింది. ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో కోట కిక్కిరిసింది. తొలిరోజే 2 లక్షల మంది అమ్మవారిని దర్శించు కున్నారని నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల నిర్వహణకుగాను జగదాంబిక ట్రస్టు బోర్డు సభ్యులకు రూ. 11.50 లక్షల చెక్కును మంత్రులు అందజేశారు.


city2.jpg

ఈసారి అదనంగా రూ.20 కోట్లు

- మంత్రులు పొన్నం, కొండా

బోనాలను చూసేందుకు దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారని ఈసారి రూ.20కోట్లు అదనపు బడ్జెట్‌ను విడుదల చేసినట్లు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ తెలిపారు. పూజల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించామన్నారు. మతాలకు అతీతంగా బోనాలను నిర్వహించ డం సంతోషకరమన్నారు.


బోనం సమర్పించిన ప్రముఖులు

- ఎమ్మెల్సీ విజయశాంతి(MLC Vijayashanti) అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు. తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలి బోనం ఎత్తుకోవడం సంతోషంగా ఉందన్నారు.

- జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా బోనం సమర్పించారు. అమ్మ తెలంగాణ ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.

- మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కలెక్టర్‌ హరిచందన, పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, మేయర్‌ విజయలక్ష్మి, వీహెచ్‌, బీజేపీ నాయకురాలు మాధవీలత అమ్మవారిని దర్శించుకున్నారు.


city2.3.jpg

కనకాల కట్టమైసమ్మకు బోనాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మకు గురువారం బోనాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘం మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఫలహారబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని జగదీష్‌ మందిర్‌ నుంచి ట్యాంక్‌మీదుగా వందలాది మంది కుమ్మర మహిళలు బోనాలతో వెళ్లి కట్టమైసమ్మ దేవాలయంలో తొలిబోనం సమర్పించారు.


పూజా కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్‌, ఆర్‌. కృష్ణయ్య, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కుమ్మరి వృత్తి ఆధునికీకరణకు గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ర్టాల్లో అధ్యయనం కోసం ప్రత్యేక బృందాన్ని పంపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మట్టికుండలోనే అమ్మవార్లకు బోనం సమర్పించాలని భక్తులకు సూచించారు. నగర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 07:33 AM