Padi Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:21 AM
ఓ గ్రానైట్ క్వారీ యాజమానిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది.

8 రూ.50 లక్షలు ఇవ్వాలని క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఈ నెల 28 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం
హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఓ గ్రానైట్ క్వారీ యాజమానిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 27న బీఆర్‌ఎస్ సభలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 28 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. బీఆర్‌ఎస్ సభ కోసం రూ.50 లక్షలు ఇస్తేనే క్వారీ నడుస్తుందని కౌశిక్ రెడ్డి ఆ క్వారీ యాజమాని అయిన తన భర్త మనోజ్ రెడ్డిని బెదిరిస్తున్నారని కట్టా ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమకొండకు చెందిన మనోహర్ రెడ్డికి కమలాపూర్ మండలం వంగపల్లి, గుండేడు గ్రామాల మధ్య ఈ క్వారీ ఉంది.
ఈ కేసును కొట్టేయడంతో పాటు అరెస్టు, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదిస్తూ అనుమతి లేకుండా క్వారీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతోనే ఆయన క్వారీ వ్యాపారికి ఫోన్ చేసినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అన్ని సమస్యలను ఎమ్మెల్యేనే పరిష్కరిస్తారా? అలాగైతే నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థలను ఎత్తేయండ’ని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఫిర్యాదుదారు, పోలీసులకు నోటీసులు జారీచేసింది.