Crime: భర్తకు విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి..
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:17 AM
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని భావానికుంట తండాకు చెందిన జాటోత్ బాలాజీ..

తరచూ గొడవ పడుతున్నాడని భార్య ఘాతుకం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడి మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
వర్ధన్నపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని భావానికుంట తండాకు చెందిన జాటోత్ బాలాజీ (44) అనే వ్యక్తి కూల్ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్యే అతడికి విషం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిందని.. అది తాగి తీవ్ర అస్వస్థతకు గురై అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎస్సై చందర్ కథనం ప్రకారం.. తండాకు చెందిన బాలాజీ వ్యవసాయ కూలీ. అతడికి భార్య కాంతి, కూతురు స్వప్న, కుమారుడు ప్రవీణ్ ఉన్నారు. ఈ నెల 8న దాటుడు పండుగను బాలాజీ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకొన్నాడు. ఆ రోజు సాయంత్రం మద్యం తాగడానికి వెళ్తానంటూ బాలాజీ ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్‌ను అతడికి భార్య కాంతి ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే గొంతులోంచి నొప్పి వస్తోందంటూ ఆమెకు బాలాజీ చెప్పాడు. భర్తను ఆ స్థితిలోనే వదిలేసి కాంతి దగ్గర్లోని తాళ్లకుంటతండాలో ఉంటున్న అక్క- బావ ఇంటికి వెళ్లింది. అయితే.. బాలాజీని పొరుగింటివారు గుర్తించి తొలుత వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అప్పటి నుంచి బాలాజీ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈనెల 13న పరిస్థితి విషమించడంతో ఎంజీఎం నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 15న మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఆ గొడవలు మనసులో పెట్టుకొనే కాంతి.. తన బావ దస్రూతో కలిసి ఈ ఘటనకు పాల్పడిందంటూ పోలీసులకు మృతుడి తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నవెదుఉ చేశారు.