High Court: అమోయ్‌కుమార్‌ను ప్రతివాదిగా చేర్చండి
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:30 AM
హైకోర్టు, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని 20 ఎకరాల బిలాదాఖల భూమి పై అమోయ్‌కుమార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. భూముల వర్గీకరణలో కలెక్టర్‌కు అధికారం లేదని స్పష్టం చేసింది

బిలాదాఖల భూమిని పట్టాగా పేర్కొనే అధికారం కలెక్టర్‌కు లేదు
అమోయ్ ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు స్టే
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): బిలాదాఖల(ప్రభుత్వ) స్థలాన్ని పట్టాభూమిగా వర్గీకరిస్తూ.. సర్వే నంబర్లను కేటాయించేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హోదాలో ఆదేశాలు జారీ చేసిన అమోయ్‌కుమార్‌ను ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. బిలాదాఖల భూమి మార్పు అధికారం కలెక్టర్‌కు లేదని స్పష్టం చేసింది. భూముల వర్గీకరణ, రెవెన్యూ ఎంట్రీలపై వ్యాజ్యాలకు సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరించాలని తేల్చిచెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని 20 ఎకరాల 12 గుంటల బిలాదాఖల భూమిని ప్రైవేటు వ్యక్తులకు చెందినట్లు పట్టాభూమిగా వర్గీకరిస్తూ.. సర్వే నంబర్లు కేటాయించాలని అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్ 2022 డిసెంబరులో జారీచేసిన ఆదేశాల(ప్రొసీడింగ్స్)పై హైకోర్టు స్టే విధించింది. ఈ వివాదం తేలేవరకు ఆ భూమి విషయంలో ఎలాంటి థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ సృష్టించరాదని.. భూమి స్వభావాన్ని మార్చరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని సర్వే నంబర్లు 398, 400, 402 తదితరాల్లో ఎర్రపోతు శైలజ కుటుంబానికి 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. ఈ సర్వే నంబర్ల చుట్టుపక్కల ఉన్న బిలాదాఖల(ప్రభుత్వ) భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించారు. శైలజ భూమిలోకి రాకపోకలను నిలిపివేస్తూ.. ప్రహరీ నిర్మించారు.
కృష్ణ రాంభూపాల్ అనే వ్యక్తి 20 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా పేర్కొనడాన్ని శైలజ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై చేవెళ్ల డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, శంకర్‌పల్లి తహసీల్దార్ సర్వే నిర్వహించి.. ప్రభుత్వ భూమిగా గుర్తించారు. బ్లూస్టిక్ ల్యాండ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ప్రహరీని నిర్మించినట్లు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో తహసీల్దార్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని సర్వే ఇన్‌స్పెక్టర్, తహసీల్దార్ పేర్కొంటున్నా.. రెండో ప్రతివాది అయిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2022 డిసెంబరు 29న విలేజ్ మ్యాప్‌లో సవరణ చేసి, కొత్త సర్వే నంబర్లను కేటాయించాలంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ప్రొసీడింగ్స్ దాఖలు చేయడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ కూడా.. 20 ఎకరాల 12 గుంటలను కృష్ణ రాంభూపాల్ అనే వ్యక్తి ఆక్రమించారని పేర్కొన్నా.. అప్పటి కలెక్టర్ పట్టించుకోలేదనే విషయం స్పష్టమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘భూముల వర్గీకరణ విషయంలో, రెవెన్యూ ఎంట్రీల విషయంలో వివాదం ఏర్పడినప్పుడు ఏంచేయాలనేది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. సదరు వివాదాల పరిష్కారానికి తగిన వేదిక సివిల్‌కోర్టు మాత్రమే. ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా వర్గీకరించే అధికారం.. సప్లిమెంటరీ సెత్వార్ లేదా కొత్త సర్వే నంబర్లు కేటాయించాలని ఆదేశించే అధికారం కలెక్టర్‌కు లేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారిక ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని.. అప్పటివరకు అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై మధ్యంతర సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ వివాదం పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం.. భూమి స్వభావం మార్చడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 24కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News