High Court: అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్తారా
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:54 AM
తప్పుడు అఫిడవిట్ సమర్పించిన గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. మరికొంతమందిపై విచారణకు ఆదేశాలు జారీచేసింది

రూ. 20 వేలు జరిమానా కట్టండి
గ్రూప్-1 మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మందికి హైకోర్టు జరిమానా
ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు
పిటిషన్ కొట్టివేత.. తప్పుడు పత్రాలివ్వడంపై విచారణకు ఆదేశం
మరో పిటిషన్‌లో.. నియామకపత్రాలు ఇవ్వొద్దన్న ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీల్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, పారదర్శకంగా తిరిగి మూల్యాంకనం చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు షాక్ తగిలింది. వారు అఫిడవిట్ (ప్రమాణపత్రం)లో అబద్ధాలు చెప్పడంతోపాటు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినందుకు పిటిషనర్లకు హైకోర్టు రూ.20వేలు జరిమానా విధించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు పత్రాలు సమర్పించడంపై విచారణ చేపట్టాలని రిజిస్ట్ర్టార్ (జ్యుడీషియల్)ను ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి రైల్వే ఉద్యోగి కే.ముత్తయ్య, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫు పీఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ.. ‘‘పిటిషనర్లు మూటగూడూరి రాహుల్ అనే అభ్యర్థికి వచ్చిన 329 మార్కులను 192కు తగ్గించి.. తప్పుడు మార్కుల షీట్‌ను కోర్టుకు సమర్పించారు. సదరు అభ్యర్థి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కోర్టుకు రాలేదు. టీజీపీఎస్సీకి కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అలాంటి తప్పుడు డాక్యుమెంట్‌ను ప్రమాణపూర్వకంగా సమర్పించే అఫిడవిట్‌లో ఎలా సమర్పిస్తారు?’’ అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్లు తప్పుడు పత్రం ఆధారంగా కోర్టు ఎదుట అబద్ధాలు చెప్పినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. పిటిషనర్లకు రూ.20 వేలు జరిమానా విధించింది. తప్పుడు డాక్యుమెంట్‌పై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేసింది.
మరో పిటిషన్‌లో టీజీపీఎస్సీ అప్పీల్..
గ్రూప్-1 మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ దాఖలైన మరో పిటిషన్‌కు సంబంధించి సింగిల్ జడ్జి ఆదేశాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌ను 20 మంది వేయగా, అందులో 19మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఆ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం.. గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాలతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి వచ్చిందంటూ టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. ‘‘పిటిషనర్లు ప్రభుత్వ ఉద్యోగులని మాత్రమే పేర్కొంటూ.. వారు ఎక్కడ పనిచేస్తున్నారో వివరాలు వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వారికి అందుబాటులో ఉన్న వనరుల ద్వారా మూల్యాంకనం చేసిన వారి వివరాలు సేకరించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. నిబంధనల ప్రకారం నిపుణులతోనే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయించాం. ఊహాజనిత ఆరోపణలతో టీజీపీఎస్సీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పిటిషనర్లు వ్యవహరిస్తున్నారు’’ అని అప్పీలులో టీజీపీఎస్సీ పేర్కొంది. దీనిపై డివిజన్ బెంచ్ త్వరలో విచారణ చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్