Share News

High Court: అక్రమ నిర్మాణాల ముందు బోర్డులు పెట్టాలి

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:38 AM

అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది.

High Court: అక్రమ నిర్మాణాల ముందు బోర్డులు పెట్టాలి

  • స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చి ఎందుకు ఆగిపోతున్నారు?: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాల ముందు అవి ‘నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలు’ అని తెలిసే విధంగా బోర్డులు పెట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా బోర్డు పెట్టడం వల్ల ప్రజలు అందులో ఇళ్లు కొని నష్టపోకుండా ఉంటారని తెలిపింది. వాటి యజమానులు పరువు కోసమైనా నిర్మాణం చేపట్టకుండా ఉంటారని పేర్కొంది. మహారాజ్‌గంజ్‌ తోటగూడలోని ఓ భవనానికి జీహెచ్‌ఎంసీ అధికారులు అది అక్రమ నిర్మాణం అని స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలు చేపట్టకుండా సాగదీస్తున్నారని ఆరోపిస్తూ జీ శ్రీనివాస్‌ అనే వ్యాపారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ అధికారులు జారీచేసిన స్పీకింగ్‌ ఆర్డర్‌ను అక్రమ నిర్మాణం వద్ద బోర్డు పెట్టి ప్రదర్శించాలని సూచించింది. అక్రమ నిర్మాణమని తేలిన తర్వాత అధికారులు ఎందుకు సాగదీస్తున్నారని, ప్రజలు కోర్టుకు వచ్చే వరకు ఎందుకు ఆగుతున్నారని ప్రశ్నించింది. కూల్చివేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా అమలు చేయడం లేదని తెలిపింది. అందువల్ల కోర్టు, అధికారులు అంటే అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి భయం పోతోందని వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోవడానికి సమయం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ న్యాయవాది కోరడంతో విచారణ ఈనెల 11కు వాయిదాపడింది.

Updated Date - Jul 05 , 2025 | 03:38 AM