Share News

High Court: టీచర్ల ప్రమోషన్‌ విధానంలో జోక్యం చేసుకోం

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:04 AM

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది.

High Court: టీచర్ల ప్రమోషన్‌ విధానంలో జోక్యం చేసుకోం

  • నేరుగా ప్రభుత్వాన్నే ఆశ్రయించండి..హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీపై ప్రస్తుతం ప్రభుత్వం పాటిస్తున్న విధానంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. నేరుగా చేపట్టే నియామకాల ద్వారా ఎంత శాతం పోస్టులు భర్తీ చేయాలి, ప్రమోషన్ల ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో కల్పించుకోబోమని పేర్కొంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో అధిక శాతం నేరుగా చేపట్టే నియామకాల ద్వారా భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చని పేర్కొంది.


ఎస్‌ఏ పోస్టుల్లో 66 శాతం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తున్నారని, నేరుగా బీఈడీ అభ్యర్థుల ద్వారా చేపట్టే నియామకాలకు కేవలం 33 శాతం మాత్రమే కేటాయించారని దీనివల్ల నష్టపోతున్నామని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలలయింది. దీనిపై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ ఎన్‌ నర్సింగ్‌రావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసే కోటాను తగ్గించాలని, శాతాలు మార్చాలని ప్రభుత్వానికి చెప్పలేమని తెలిపింది. పిటిషన్‌ దాఖలు చేసిన బీఈడీ అభ్యర్థులు ఈ విషయమై ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలిపింది. పిటిషన్‌ విచారణను ముగించింది.

Updated Date - Apr 19 , 2025 | 04:04 AM