Heavy Rain In Telangana: వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు!
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:21 AM
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
తాండూరులో 11.18 సెం.మీ. వాన, దౌల్తాబాద్‌లో 10.68 సెం.మీ.
పలు కాలనీల్లో నీట మునిగిన ఇళ్లు
ముంపులో వందలాది ఎకరాల పంటలు
మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేటు
90,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గడచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా తాండూరు, దౌల్తాబాద్, సంగారెడ్డి జిల్లా కంగ్టి, నల్గొండ జిల్లా ఆదిదేవుల పల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. అలాగే, రాష్ట్రంలోని 585 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 11.18, దౌల్తాబాద్ మండలంలో 10.68, యాలాలలో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షానికి పలుచోట్ల వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. తాండూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
పరిగి పట్టణంలోనూ లోతట్టు ప్రాంత కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండల తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరి రికార్డులు తడిసిపోయాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటు నిర్మల్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తలోడికి చెందిన చాప్లే ఏమాజీ(55) మంగళవారం పిడుగు పాటుతో మృతి చెందగా, ఆయన కుమారుడు అజయ్‌కు గాయాలయ్యాయి.
90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం ప్రాజెక్టు గేటు మళ్లీ తెరుచుకుంది. ప్రాజెక్టుకు 90,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో మంగళవారం ఒక గేటును ఎత్తి 27 వేలు, రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 67,185 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.70 అడుగులకు చేరుకుంది. జూరాలకు 1.02 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మొత్తం 8 గేట్ల ద్వారా 32,752, విద్యుదుత్పత్తి ద్వారా 36,278 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. అలాగే, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 74,474 క్యూసెక్కులు నీరు చేరుతోంది. ఇక, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలోకి 98,440 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి