Rainfall Weather: మబ్బులు.. జల్లులు!
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:41 AM
ఆలస్యంగా వచ్చినా జోరుగానే వచ్చి రైతులను మురిపిస్తోంది వాన! రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఉదయం నుంచే ఆకాశం మబ్బు పట్టింది.

రాష్ట్రంలో రోజంతా ముసురు
ఇళ్లకే పరిమితమైన ప్రజలు
ములుగు వెంకటాపురంలో 23.52 సెం.మీ వర్షపాతం
కాళేశ్వరం వద్ద 7.3 మీటర్ల ఎత్తుతో గోదావరి
మరో రెండ్రోజులు వర్షాలు
14 జిల్లాలకు ఎల్లో అలర్ట్
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఆలస్యంగా వచ్చినా జోరుగానే వచ్చి రైతులను మురిపిస్తోంది వాన! రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఉదయం నుంచే ఆకాశం మబ్బు పట్టింది. పొద్దున నుంచి రాత్రిదాకా జల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల మోస్తరుగా ఇంకొన్నిచోట్ల భారీగా వర్షం పడింది. వరదకు వాగులు, కుంటలు, చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వరినాట్లు వేసిన, వేస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ చినుకులతో వర్షాధార మెట్ట పంటలకు ఊపిరిపోసినట్లయింది. మొత్తంగా నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. గురువారం వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు.. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో వర్షం పడింది. హైదరాబాద్‌లో వర్షం కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. రోడ్లపై ట్రాఫిక్ సమస్య నెలకొంది. ములుగు జిల్లా వెంకటాపురంలో 23.52 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌లో 12.5 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ఓదేలులో 6.5 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5.6 సెం.మీ, నిర్మల్ జిల్లా ముథోల్‌లో 5.4 సెం.మీ, సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 5 సెం.మీ, జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో 4.9 సెం.మీ, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 4.8 సెం.మీ, నారాయణపేట రూరల్‌లో, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 4.7సెం.మీ, ఖమ్మం జిల్లా కామేపల్లిలో 4.1 సెం.మీ, మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో 4.4 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో 3.4 సెం.మీ, మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 2.7 సెం.మీ, వనపర్తి జిల్లా రేవల్లిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరులో వర్షంతో ఓ ఇల్లు కూలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఉప్పర్‌పల్లిలో ఓ ఇంటిగోడ కూలిపోయింది. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడలో దుందుభి వాగు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, మణుగూరు, ఇల్లెందు సింగరేణి ఏరియాల్లోని గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మేడ్చల్ జిల్లాలో బీజాపూర్-చేవెళ్ల రహదారి వర్షానికి దెబ్బతింది.
ఇంకా వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ 14 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఓపీ కౌంటర్లు పెంచాలి: దామోదర
వర్షాలు, వాతావరణ మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు తక్షణమే జిల్లాలకు వెళ్లి, ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని చెప్పారు. సంగారెడ్డి నుంచి గురువారం ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో దామోదర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జ్వరాలు, ఇతర వ్యాధుల కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలను అప్రమత్తం చేయాలని.. అలాగే వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు.. క్రమం తప్పకుండా మంచి నీటి నమూనాలను సేకరించి, పరీక్షించాలన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉందని, ఓపీ కౌంటర్లను పెంచాలని, అవసరమైతే ఓపీ వేళలను పొడిగించుకోవాలని చెప్పారు. అన్ని రకాల మందులు, వైద్య పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో వార్డులు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోయినా, రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినా ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంవోలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు క్రమంతప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో పాముకాటు ఔషధాలను అందుబాటులో ఉంచాలన్నారు.
ఉధృతంగా గోదావరి
భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి 7.3 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 2.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అంతేనీటిని బయటకు వదులుతున్నారు. దిగువన ఉన్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 2.14 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు బొల్లారం గ్రామ సమీపంలో బుంగపడింది. జేసీబీ సాయంతో బుంగను పూడ్చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గింది. రెండు గేట్ల ద్వారా 79,983 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆల్మట్టిలోకి 42,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అంతేనీటిని వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 45వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 54,410 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలలోకి 60వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 61వేల క్యూసెక్కులను వదులుతున్నారు.
ఎక్కడా ప్రాణ నష్టం జరగొద్దు: సీఎం రేవంత్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాలు, వరదలకు సంబంధించి గురువారం ఆయన ఢిల్లీ నుంచి సీఎంవో అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News