Srisailam Project: శ్రీశైలానికి పోటెత్తిన వరద
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:54 AM
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. శనివారం ఏకంగా 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. దాంతో ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 67 వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు.

ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కులు
జూరాల 1.20 లక్షలు, తుంగభద్రకు 72 వేల క్యూసెక్కులు
వారంలో గోదావరికి భారీగా వరద: సీడబ్ల్యూసీ
హైదరాబాద్/ధరూర్/దోమలపెంట/మహాదేవపూర్ రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. శనివారం ఏకంగా 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రికార్డయింది. దాంతో ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 67 వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు. శ్రీశైలం సామర్థ్యం 215.81 టీఎంసీలకు ప్రాజెక్టులో ప్రస్తుతం 173.47 టీఎంసీలున్నాయి. అయితే ప్రాజెక్టు గ్రేట్ల నుంచి నీరు లీక్ అవుతుండటం గమనార్హం. నెల క్రితమే అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 10వ గేటు నుంచి భారీగా.. 5, 6 గేట్ల నుంచి స్వల్పంగా నీరు లీకవుతోంది. ఇక దిగవనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 55 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 156.86 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా.. 1.24 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
తుంగభద్ర జలాశయానికి 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. గేట్లు, జలవిద్యుదుత్పత్తి కోసం 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 5,477 క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీకి 76,600 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి ప్రాజెక్టులకు వారం రోజుల్లో భారీ వరద వచ్చి చేరే అవకాశముందని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ప్రకటించింది. కాగా, ప్రాజెక్టుల నుంచి సాగు నీటి విడుదల విషయమై ఈనెల 11న ఈఎన్‌సీ(జనరల్) అంజద్ హుస్సేన్ అధ్యక్షతన స్కైవమ్(రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ) సమావేశం జరగనుంది. దీనికోసం ఏయే ప్రాజెక్టుల్లో ఎంత నిల్వలున్నాయి? అందులో తాగునీటి అవసరాలకెంత? సాగునీటి అవసరాలకెంత? అనే వివరాలను క్షేత్రస్థాయి అధికారుల నుంచి సేకరిస్తున్నారు.