Srisailam: నిండుకుండలా శ్రీశైలం
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:52 AM
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద పోటెత్తుతుండటంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుండగా.. శ్రీశైలం రిజర్వాయర్ కళకళలాడుతోంది.

1.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. రేపు తెరుచుకోనున్న ప్రాజెక్టు గేట్లు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు భారీ, రేపు అతిభారీ వర్షాలు
పోలవరం/ కర్నూలు/ దరూరు/దోమలపెంట, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద పోటెత్తుతుండటంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుండగా.. శ్రీశైలం రిజర్వాయర్ కళకళలాడుతోంది. ఎగువన నారాయణపూర్ నుంచి జూరాలకు 99,933 క్యూసెక్కుల వరద విడుదలవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 317.440 మీటర్లు కాగా, 7.535 టీఎంసీలు ఉన్నాయి. జూరాలకు ఆదివారం 1.13 లక్షల క్యూసెక్కుల నీటి ఇన్‌ఫ్లో నమోదు కాగా, డ్యామ్ 12 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 79,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రాలకు 29,296 క్యూసెక్కులు, వివిధ కాలువలు, లిఫ్ట్ కెనాల్‌లకు 3,455 క్యూసెక్కులతోపాటు దిగువకు 1,11,804 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో 204.728 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 172.66 టీఎంసీల నీరు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో మంగళవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశెలం ప్రాజెక్టుకు 1,86,212 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మరోవైపు,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ కాలువలకు 10 వేల క్యూసెక్కులు, ప్రాజెక్టు పరిధిలోని జంట విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ తయారీకి 67,740 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు, ఎగువ నుంచి తుంగభద్ర ప్రాజెక్టుకు 52,308 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, జలాశయంలో నీటి నిల్వ 77.34 టీఎంసీలకు చేరింది.
ఆల్మట్టి నుంచి లక్ష క్యూసెక్కుల ఔట్ ఫ్లో
ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 91.08 టీఎంసీలు కాగా, రిజర్వాయర్‌కు 1,02,140 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దిగువకు 1,06,070 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 30.85 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రాజెక్టుకు 99,933 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదయ్యింది.
అల్పపీడనంతో గోదావరి పరీవాహకంలో కుంభవృష్టి
మరోవైపు, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో ఆదివారం ఒడిశా, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఛత్తీ్‌సగఢ్‌లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. దీంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో గోదావరికి వరద పోటెత్తనుండగా, దాని ఉప నదులు వైన్ గంగా, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగనున్నది.
Also Read:
కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More Telangana News And Telugu News