Telangana Weather Alert: ఎండల మంట వానల తంటా
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:46 AM
రాష్ట్రంలో ఆదివారం ఎండలు, అకాల వర్షాలు కుదుర్చిన మానవ అనర్థాలు, పంట నష్టాలు పెరిగాయి. వడదెబ్బ, పిడుగుపాటు కారణంగా ములుగు, వనపర్తి జిల్లాల్లో మరణాలు, భారీ నష్టం జరిగింది.

రాష్ట్రంలో ఆదివారం కొనసాగిన విచిత్ర వాతావరణం
ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో మండిన సూరీడు
నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో రైతులను దెబ్బతీసిన అకాల వర్షం
వనపర్తిలో పిడుగుపాటుకు 25 గొర్రెల మృతి
ములుగు జిల్లాలో వడదెబ్బకు ఒకరి మృతి
నేడు వర్షాలు, రేపట్నించి తీవ్రం కానున్న ఎండలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో కొద్ది రోజులుగా విచిత్ర వాతావరణం ఉంటుంది. తెల్లవారుజాము నుంచే చాలా చోట్ల సూర్యుడు ప్రతాపం చూపుతుండగా.. పలు చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎండలు దంచికొట్టగా..నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత నిజామాబాద్‌లో 43.1, మెదక్‌లో 41.8, రామగుండంలో 41.4, నల్లగొండ, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోపక్క, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. తాడూరు మండలంలో మొక్కజొన్న, పెసర్లు, వరి పంటలు నేలకొరిగాయి. తెలకపల్లి మార్కెట్‌యార్డులో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న, వడ్లు తడిచిపోయాయి.
జిల్లాలో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వనపర్తి జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పెద్దమందడి, కొత్తకోట, గోపాల్‌పేట, రేవల్లి, వనపర్తి మండలాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడిచిపోయింది. గోపాల్‌పేట మండలంలోని చాకల్‌పల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల సమీపంలో పిడుగుపడి రాములు, విశ్వనాథం అనే గొర్రెల కాపరులు గాయపడగా, 25 గొర్రెలు మృతి చెందాయి. జోగుళాంబ గద్వాల జిల్లాఆలంపూర్, ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అయిజ మండలంలో వరి పైర్లు దెబ్బతిన్నాయి. మల్దకల్ మండలంలో పిడుగుపాటు వల్ల ఎద్దులు మరణించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిశాయి. పిడుగుపాటుకు ఓ ఆవు మరణించగా, యాచారం మండలంలో పంటలు దెబ్బతిన్నాయి.
వడదెబ్బతో వలస కూలీ మృతి
ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలో.. పూనెం సన్ను(32) అనే వలస కూలీ వడదెబ్బకు గురై మరణించాడు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన సన్ను స్థానిక మిర్చితోటలో పని చేయడానికి వచ్చాడని, పని ప్రాంతంలో వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడని పోలీసులు వెల్లడించారు.
నేడు వర్షాలు, రేపట్నించి మంటలు
రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక, మంగళవారం నుంచి రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. 44-45 డిగ్రీల దాకా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..