Hyderabad Cricket Association AGM: అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:07 AM
హెచ్‌సీఏ 87వ వార్షిక సర్వసభ్య సమావేశం ఏజీఎం కొనసాగింపు సమావేశం

ఉప్పల్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హెచ్‌సీఏ 87వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కొనసాగింపు సమావేశం శనివారం ఐదు నిమిషాల్లోనే గందరగోళంగా ముగిసింది. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు దల్జిత్ సింగ్ అధ్యక్షతన ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్‌గా జస్టిస్ కేసీ భానును నియమించారు. వీరి పేర్లను మాజీ క్రికెటర్ శివ్‌లాల్ యాదవ్ ప్రతిపాదించగా, చాముండేశ్వర్‌నాథ్ బలపర్చారు. దీంతో వీరి నియామకాన్ని ప్రకటించిన దల్జిత్ సింగ్ వెంటనే సమావేశాన్ని ముగించారు. అయితే, గత ఏజీఎంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ పదవులకు ప్రతిపాదించిన పేర్లు కాకుండా కొత్త వారిని నియమించడాన్ని సీనియర్ క్లబ్ సెక్రటరీ లక్ష్మణ్ రావు తప్పుబట్టారు. ఇక, గత రెండు ఏజీఎంలకు అనుమతించిన 57 క్లబ్‌లను ఈ సమావేశానికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ మాజీ క్రికెటర్ అజరుద్దీన్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ్ సహా పలువురు సభ్యులు ఏజీఎంకు హాజరు కాలేదు. ఇక, ఏజీఎం జరుగుతుండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరును తెలంగాణ క్రికెట్ సంఘంగా మార్చాలని, జిల్లాల్లోనూ క్రికెట్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని తెలంగాణ క్రికెట్ జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేడియం బయట ధర్నా జరిగింది. పోలీసులు వారిని అరెస్టు చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News