High Court: రెండు గంటలకు ముందు పరీక్ష రాయకుండా అడ్డుకోవడం చెల్లదు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:51 AM
పరీక్షల సమయానికి కేవలం రెండు గంట ముందు విద్యార్థిని రాయకుండా సస్పెండ్ చేయడం కఠినమైన చర్య అని హైకోర్టు పేర్కొంది.

అది కఠినమైన చర్య.. హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పరీక్షల సమయానికి కేవలం రెండు గంట ముందు విద్యార్థిని రాయకుండా సస్పెండ్ చేయడం కఠినమైన చర్య అని హైకోర్టు పేర్కొంది. పరీక్షలు రాయకుండా రెండు గంటల ముందు సస్పెండ్ చేశారని పేర్కొంటూ జడ్చర్లలోని ఎస్‌వీకేఎం నర్సీ మాంజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీ్‌సకు చెందిన న్యాయశాస్త్రం చివరి సంవత్సరం విద్యార్థి ఆనంద్‌రాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ గౌతమ్ వాదిస్తూ.. సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం వల్ల విద్యాసంవత్సరం కోల్పోతారని పేర్కొన్నారు.
ఇటీవల ఆ సంస్థలో కలుషిత ఆహారం కారణంగా 170 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యార్థిని పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేసే అధికారం స్వయంగా కాలేజీకి ఉంటుందా? అని ప్రశ్నించింది. దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. మిగతా పరీక్షలకు అనుమతించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 2కు వాయిదా వేసింది.