Harish Rao: కంచ గచ్చిబౌలి భూముల రుణాలపై సెబీకి హరీశ్‌రావు ఫిర్యాదు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:44 AM
కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూములను తనఖా పెట్టి టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకున్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ చైర్మన్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు, ఆధారాలతో ఆయన సెబీ చైర్మన్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించిందని, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఆ వాస్తవాలను దాచి అటవీ భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమన్నారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజ్ చెల్లించిందని పేర్కొన్నారు. అడ్డదారుల్లో రుణాలు పొందిన ఈ వ్యవహరంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సెబీని కోరారు. సెబీ నిబంధనలకు సంబంధించి 8 ఉల్లంఘనలకు తెలంగాణ ప్రభుత్వం పాల్పడిందని లేఖలో వివరించారు.