Group-1: ఎంపికైన అభ్యర్థుల జీవితాలను బలిపెట్టొద్దు
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:31 AM
కొంతమంది పిటిషనర్‌ల ఆధారరహిత ఆరోపణల కోసం తమ జీవితాలను బలిపెట్టకూడదని గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును కోరారు.

పరీక్షలపై న్యాయసమీక్షకు అవకాశం తక్కువ
గ్రూప్-1పై వాదనలు
కొంతమంది పిటిషనర్‌ల ఆధారరహిత ఆరోపణల కోసం తమ జీవితాలను బలిపెట్టకూడదని గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును కోరారు. గ్రూప్-1 మూల్యాంకనంలో లోపాలతోపాటు, సెంటర్ల కేటాయింపు, పేపర్లు సరిగాదిద్దలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌లలో పలువురు ఎంపికైన అభ్యర్థులు ఇంప్లీడ్ అయ్యారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. పోటీ పరీక్షల వంటి నైపుణ్యంతో కూడిన వ్యవహారాల్లో న్యాయసమీక్షకు చాలా తక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని.. వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు. అత్యంత రహస్య అంశాలు సహా టీజీపీఎస్సీ మొత్తం ఎంపిక ప్రక్రియను కోర్టు ముందు ఉంచిందని, అక్రమాలకు అవకాశం లేని పారదర్శకమైన ఎంపిక జరిగిందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. అత్యంత పకడ్బందీగా జరిగిన ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదాపడింది.