Greater Hyderabad: మొత్తం 2,735 చ.కి.మీ.. అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరణ
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:31 AM
మొత్తం 2,735 చ.కి.మీటర్లతో హైదరాబాద్ నగరం విస్తరించింది. హైదరాబాద్... ఇప్పుడు అతిపెద్ద నగరం. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు.
- విస్తరణకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం..!
- ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా తొలగిన రాజకీయ భ్రమలు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి మరింత విస్తరించనుంది. ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు వెళ్లనుంది. సుమారు 2,735 చ.కి.మీ. పరిధి వరకు పెరిగి అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఔటర్ పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీ(GHMC)లో విలీనం చేయడానికి నిర్ణయించారు. దీంతో జీహెచ్‌ఎంసీ సేవలు మున్ముందు ఔటర్ అవతలి వరకు గల ప్రాంతాల వరకు అందనున్నాయి.

అయితే విలీన ప్రక్రియతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఒక్కసారిగా రాజకీయ భ్రమలు తొలగిపోయాయి. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా చైర్మన్లు, మేయర్‌గా పదవులు అనుభవించాలని భావించిన వారికి నిరాశ ఎదురయ్యింది. మున్ముందు జీహెచ్‌ఎంసీ ఒకే పాలకమండలిగా ఉంటుందా.? లేక పాలనా సౌలభ్యం కోసమంటూ వికేంద్రీకరణ చేస్తారా? అనే సందేహాలు నెలకొన్నాయి. మూడు పోలీసు కమిషనరేట్ల మాదిరిగా.. జీహెచ్‌ఎంసీని కూడా మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్పు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
భిన్నాభిప్రాయాలు...
నార్సింగ్: జీహెచ్‌ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను కాలనీ సంఘాలు స్వాగతిస్తుండగా, రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పుడే విలీనం వద్దంటూ మొరపెట్టుకుంటున్నాయి. నార్సింగ్, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీల్లోని 60 శాతం కాలనీ సంక్షేమ సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కలిపితే మరింత మెరుగైన అభివృద్ధి జరుగుతుందని హుడాకాలనీ మాజీ అధ్యక్షుడు సీతారాందాసు పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో ఇతర రాజకీయ పార్టీలు వారు మాత్రం ఒక్క అవకాశం కల్పించాలని, ఒక దఫా మున్సిపాలిటీలుగానే ఉంచాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి బండ్లగూడ, నార్సింగ్, మణికొండ(Manikonda)లను కలిపి ఒకే మేజర్ మున్సిపాలిటీ చేయాలని కోరుతున్నారు. ఈ మూడింటిని హైదరాబాద్(Hyderabad)లో కలపవద్దని పీసీసీ అధికార ప్రతినిధి, కోకాపేట మాజీ సర్పంచ్ ముంగి జైపాల్‌రెడ్డి కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళతామని తెలిపారు. నార్సింగ్, మణికొండ, బండ్లగూడాతో పాటు శంషాబాద్‌ను కూడా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయవద్దని, మున్సిపాలిటీలుగా ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News