Bonalu Festival: జగదాంబికా తల్లీ.. అందుకో బోనం!
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:25 AM
గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం దక్కింది! పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన అషాఢమాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తెరలేచింది.

గోల్కొండ కోటలో అమ్మవారికి తొలి మొక్కులు
నగరంలో ఘనంగా ఆషాఢమాసం బోనాల వేడుక షురూ
పట్టువస్త్రాలు సమర్పించిన కొండా సురేఖ, పొన్నం, స్పీకర్
కార్వాన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం దక్కింది! పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన అషాఢమాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తెరలేచింది. గోల్కొండ కోటలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన వేడుక రాత్రి 11 గంటల వరకు జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్‌కుమార్ లంగర్‌హౌజ్‌లో తొట్టెలకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
లాల్‌దర్వాజా ఉమ్మడి బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు సినీనటి, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నాయకురాలు మాధవీలత నెత్తిన బోనాలతో కోటపైకి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొదటిరోజు గోల్కొండ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో కోటపైకి వెళ్లి అమ్మవారికి భక్తిప్రపత్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ప్రారంభమైన ఉత్సవాలు జూలై 24 వరకు జరుగుతాయి.