Share News

BC Reservation: గవర్నర్‌ వద్దకు ఆర్డినెన్స్‌ ఫైలు

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:49 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా..

BC Reservation: గవర్నర్‌ వద్దకు ఆర్డినెన్స్‌ ఫైలు

  • ఆమోదం తర్వాత ఆర్డినెన్స్‌ జారీ

  • అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%పై ఉత్తర్వులు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌పై.. గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ ఫైలు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా.. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లో సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్‌ ముసాయిదా గవర్నర్‌ కార్యాలయానికి చేరింది. ఆ చట్టంలోని సెక్షన్‌ 285 (ఏ)ను సవరించాలని మంత్రివర్గం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ ఫైలును గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ దాన్ని పరిశీలించనున్నారు. నిపుణులతోనూ ఆయన చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సామాజికవర్గాల రిజర్వేషన్లూ కలిపి 50 శాతం మించరాదని గతంలో పలు కేసుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు ప్రత్యేక సమయాల్లో పె ంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే చట్టసవరణ చేసి, రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా చట్టంలోని సెక్షన్‌ 285 (ఏ)లోని 50 శాతం సీలింగ్‌ అనే పదాన్ని తొలగించడంతోపాటు, ఇతర సెక్షన్లలోనూ పలు సవరణలు చేయనుంది. ఈ విషయాన్నే పేర్కొంటూ గవర్నర్‌కు ఫైలును పంపింది. అలాగే రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతతో పాటు..కులగణన వివరాలను కూడా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తెలిసింది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం రాష్ట్ర పరిధిలోనిదే కావడంతో గవర్నర్‌ దగ్గర ఆలస్యం జరగదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ రాగానే రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిషన్‌ మరోసారి రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ కమిషన్‌ గతంలోనే ఒకసారి ప్రభుత్వానికి ఈ వివరాలు ఇచ్చినప్పటికీ.. అవి సుప్రీంకోర్టు సూచించిన 50శాతం రిజర్వేషన్లు మించరాదన్న నిబంధనకు లోబడి ఉనాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటిని పెంచేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకురానుండడంతో బీసీలకు 42శాతం ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు, అన్ని కులాల రిజర్వేషన్లు కలిపి ఏ మేరకు వస్తాయనే వివరాలను కమిషన్‌ తేల్చనుంది. దీనిపై సమగ్ర నివేదికను వారంరోజుల్లో ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిసింది. కాగా ఇప్పటికే వార్డు సభ్యులకు గ్రామం యూనిట్‌గా, సర్పంచ్‌కు మండలం, ఎంపీపీలకు, ఎంపిటీసీలకు జిల్లా, జడ్పీ ఛైర్మన్‌లకు రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని మొత్తం 5-6 రకాల రిపోర్టులను రూపొందించారు. దీని ప్రకారమే మళ్లీ కొత్త నిబంధనలను, 42శాతం రిజర్వేషన్ల మేరకు రూపొందించనున్నట్టు సమాచారం.

Updated Date - Jul 16 , 2025 | 03:49 AM