Share News

Telangana BC Reservation: రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:53 AM

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కీలక సమావేశం నిర్వహించారు..

Telangana BC Reservation: రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉందా

  • ఆర్డినెన్స్‌ న్యాయపరంగా నిలుస్తుందా?

  • బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ప్రశ్నలు

  • అడ్వకేట్‌ జనరల్‌తో జిష్ణుదేవ్‌ వర్మ సమావేశం

  • రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చట్టానికే సవరణ

  • ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ

  • మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్‌పై చర్చిస్తున్న గవర్నర్‌.. త్వరలోనే నిర్ణయం!

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డితోపాటు మరికొందరితో మంగళవారం రాజ్‌భవన్‌లో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు, సందేహాలను గవర్నర్‌ లేవనెత్తినట్లు తెలిసింది. ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేసే అధికార పరిధి రాష్ట్ర స్థాయిలో ఉందా? న్యాయపరంగా ఇది నిలుస్తుందా? అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అఽధికారం ఆర్టికల్‌ 243 డి(6) ప్రకారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. అదేవిధంగా ఆర్టికల్‌ 243 టి(6) ప్రకారం మునిసిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం కల్పించిన ఈ అధికారాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిరికల్‌ డేటా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుందని, రాజ్యాంగం ప్రకారమే ఈ ఆర్డినెన్స్‌ ఉందని అడ్వకేట్‌ జనరల్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. అయితే.. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు కదా! అని గవర్నర్‌ ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఏజీ స్పందిస్తూ.. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285 (ఎ)కు మాత్రమే సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తేవాలని ప్రభుత్వం భావించిందని, ఈ ఆర్డినెన్స్‌లో ఎవరెవరికి ఎంతెంత శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్న ప్రస్తావన లేదని చెప్పినట్లు తెలిసింది. కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను ఉటంకిస్తూనే ఆర్టికల్‌ 285(ఎ) సెక్షన్‌ ఉంది కదా! అని గవర్నర్‌ అన్నట్లు సమాచారం. అయితే.. ఆర్డినెన్స్‌ వచ్చాక మాత్రమే ఎంతశాతం రిజర్వేషన్లు అనేది జీవో ద్వారా ఇస్తారని, అంతవరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్లు కాబోదని ప్రభుత్వ న్యాయనిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఆర్డినెన్స్‌ వ్యవహారంపై గవర్నర్‌ మరింత మంది న్యాయనిపుణులతోనూ మాట్లాడుతున్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక దీనిపై ఆయన నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఈ నిర్ణయం కూడా అతిత్వరలోనే ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 05:53 AM