Womens Empowerment: మహిళలకు రైస్‌మిల్లులు
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:44 AM
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం... రైస్‌మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు
మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు
ఒక్కో మిల్లు నిర్మాణానికి రూ. 3.50 కోట్ల ఖర్చు
ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు
స్థల సేకరణ, ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు
553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు
ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత షురూ
చురుగ్గా పనిచేస్తున్న, టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం
ఎమ్మెల్యేల ప్రతిపాదనలకూ ప్రాధాన్యం
మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుదుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం... రైస్‌మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైస్‌మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లులు ఏర్పాటు చేస్తామని, గోదాములు నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం రోజున సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పౌరసరఫరాలు- గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లా మహిళా సమాఖ్యలు ఉండగా.. వాటి పరిధిలో 553 మండల మహిళా సమాఖ్యలు ఉన్నాయి. గ్రామస్థాయిలో 18 వేల గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 4.37 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వాటిలో 47.40 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇందులో మహిళా సమాఖ్యలున్న మండలాలకు రైస్‌మిల్లులను మంజూరు చేస్తే 553 మిల్లులను నిర్మించాల్సి ఉంటుంది.
ఒక్కో మిల్లుకు రూ.3.50 కోట్లు..
నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఒక్కోరై్‌సమిల్లు నిర్మాణానికి కనీసం రూ. 3.50 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. యంత్ర సామాగ్రి కూడా రాష్ట్రంలోనే లభిస్తుంది. గంటకు 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న యంత్ర సామాగ్రి కొనుగోలు, వాటిని నిర్ణీత ప్రదేశంలో బిగించి సిద్ధం చేయడానికి సుమారు రూ. 1.10 కోట్లు అవుతుంది. దీనికి ‘సార్టెక్స్ మిషినరీ (మట్టిపెళ్లలు, బెరుకులను వేర్వేరు చేసి తొలగించే యంత్రాలు)’ను జోడించటానికి మరో రూ.75 లక్షలు కావాలి. భవన నిర్మాణం, నీట‘ి సరఫరా, విద్యుత్, ఇతర సదుపాయాలు కలసి రూ.3.50 కోట్ల వరకు అవసరం అవుతాయని లెక్కించారు. ఇక రైస్‌మిల్లు నిర్మాణానికి ఒకటిన్నర ఎకరాల మేర స్థలం అవసరం. స్థలాన్ని ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనుండటంతో ఈ మేరకు మహిళా సంఘాలపై భారం తప్పుతుంది. మొత్తం 553 మండల మహిళా సమాఖ్యలకు రైస్‌మిల్లులు మంజూరు చేయాలంటే.. రూ.1,935 కోట్లు ఖర్చవుతుంది. అంటే సుమారు రూ. 2 వేల కోట్లతో ఈ పథకాన్ని చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థల సేకరణ చేయాల్సి వస్తే.. ఆ మేరకు అదనపు భారం ఉంటుందని పేర్కొంటున్నారు. రైస్‌మిల్లుల నిర్మాణానికి స్థలం ఎంపిక, సేకరణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో పరిశీలన జరిపించి స్థలాలు ఎంపిక చేయనున్నారు. ఈ పథకాన్ని దశలవారీగా చేపట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న మండలాలను.. చురుగ్గా పథకాల్లో భాగస్వామ్యం అవుతూ, వార్షిక టర్నోవర్ బాగున్న మండల మహిళా సమాఖ్యలను మొదట ఎంపికచేయనున్నారు. ఎమ్మెల్యేలు ఏవైనా మండల సమాఖ్యలను ఈ పథకం కోసం ప్రతిపాదిస్తే.. పరిగణనలోకి తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు
సాధారణంగా రైస్‌మిల్లులు నిర్వహించే వ్యాపారవేత్తలు నాబార్డు నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆస్తులు తనఖా పెట్టాల్సి ఉంటుంది. కానీ మహిళా సమాఖ్యలకు ఈ అవసరం ఉండదని... ప్రభుత్వమే మహిళలు, బ్యాంకులకు మధ్యవర్తిగా వ్యవహరించడంతోపాటు గ్యారంటీ కూడా ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి మండల సమాఖ్యకు పాలకవర్గాలున్నాయి. గ్రామైక్య సంఘాల (వీవో) నుంచి మండల సమాఖ్యలో పాలకవర్గ ప్రతినిధులు ఉంటారు. ఈ పాలకవర్గాలకే రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రభుత్వం చెల్లించే మిల్లింగ్ చార్జీలు, ఉప ఉత్పత్తుల విక్రయంతో వచ్చే ఆదాయంతో మహిళా సమాఖ్యలు బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలి.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ఽసేకరించిన ధాన్యాన్ని తొలుత నిల్వ చేయటానికి, మరాడించిన తర్వాత బియ్యం నిల్వ చేయటానికి గోదాములు అవసరం. ఈ క్రమంలో మహిళా సమాఖ్యలకు గోదాముల నిర్మాణం కూడా చేసిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ గోదాముల నిర్మాణ బాధ్యతలను మార్కెటింగ్ శాఖకు అప్పగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న తరహాలోనే మార్కెటింగ్ శాఖ నిధులతో గోదాములు నిర్మించి.. మహిళా సమాఖ్యలకు అప్పగించేలా కసరత్తు జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News