GHMC: విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:59 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది విలీనం పూర్తయితే ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్‌ఎంసీ ఉండనుంది.
- ఆర్థిక వనరులు, అభివృద్ధిలో అసమానతలు లేకుండా జాగ్రత్తలు
- పాలకమండలి గడువు ముగిశాకా..? ఇప్పుడేనా..?
- న్యాయపరమైన ఇబ్బందుల పరిశీలన
- విలీన ప్రతిపాదనపై బల్దియా అభిప్రాయం
- సీజీజీకి అధ్యయన బాధ్యతలు
- త్వరలో నివేదిక..?
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)లో శివారు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల విలీనం నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వ విభాగాలు దృష్టి సారించాయి. విలీనం పూర్తయిన తర్వాతే కార్పొరేషన్ల విభజన, డివిజన్ల పునర్విభజన కసరత్తు మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఔటర్ లోపల, ఆనుకొని ఉన్న స్థానిక సంస్థల్లో ప్రస్తుత పరిస్థితుల అంచనాకు కసరత్తు ప్రారంభించారు. గతంలోనే 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల మ్యాపులు, అక్కడి జనాభా, ఎన్ని వార్డులున్నాయు? ఓటర్లు తదితర సమాచారం పురపాలక శాఖ సేకరించింది. కార్పొరేషన్ల ఏర్పాటు, ఇబ్బందులు, ఇతరత్రా అంశాల బాఽధ్యతలను ఓ సంస్థకు అప్పగించారు. నివేదిక ఆధారంగా ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి? అవి ఎలా ఉండాలి? అన్న దానిపై సూత్రప్రాయ అంచనాకు వచ్చినట్టు సమాచారం.
ఫిబ్రవరి 10 తర్వాతే..
విభజనకు సంబంధించిన ప్రక్రియ ఫిబ్రవరి 10 తర్వాతే ఉంటుందని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. ‘ఇప్పటికే సమాచారం సిద్ధంగా ఉన్న దృష్ట్యా సీజీజీ ఇచ్చే నివేదిక, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. సర్కారు నిర్ణయం తీసుకున్న అనంతరం ఒకటి, రెండు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది’ అని ఓ అధికారి చెప్పారు.

సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు
ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్‌ఎంసీ ఉండనుంది. 2 వేల చ.కి.మీలకు పైగా విస్తీర్ణంలో ఉండే ప్రాంతంలో మెరుగైన పౌర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పాలనా వ్యవహారాల్లోనూ కొంత ఇబ్బందులుంటాయని అర్బన్ ప్లానర్లు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఒకే కార్పొరేషన్‌గా కాకుండా రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల కల్పన, జనాభాలో సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో భౌగోళికంగానూ సరిహద్దుల ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ల పరిధి ఆధారంగా..
పోలీస్ కమిషనరేట్ల పరిధి ఆధారంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతుల జారీ, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం ఎంతన్నది పరిగణనలోకి తీసుకోనున్నారు. పన్ను ఎక్కువగా వసూలయ్యే, వసూలు కాని ప్రాంతాలు కార్పొరేషన్ పరిధిలో ఉండేలా చూడాల్సి ఉంటుందని, అప్పుడే అభివృద్ధిలో అసమానతలు ఉండవని అర్బన్ ప్లానర్ ఒకరు తెలిపారు.

బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. శివారు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ విలీనానికి న్యాయపరమైన, మునిసిపల్, జీహెచ్‌ఎంసీ చట్టాల ప్రకారం ఇబ్బందులుంటాయా? అన్నది పరిశీలించాల్సి ఉంటుందని సీనియర్ అధికారొకరు తెలిపారు. బల్దియాకు సంబంధించి ఏ విషయంలోనైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ క్రమంలో సర్కారు నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
త్వరలో నివేదిక..
విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి అభిప్రాయం చెప్పాలన్న సర్కారు సూచనను ఇటీవల కౌన్సిల్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత గ్రేటర్‌లో జనాభా, డివిజన్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక స్వరూపం, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలపై అధ్యయనం చేసే బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అప్పగిస్తూ బల్దియా తాజాగా నిర్ణయం తీసుకుంది. విలీనం, తద్వారా ప్రయోజనాలు, ఎదురయ్యే ఇబ్బందులు, ఏ ప్రతిపాదికన డివిజన్ల పునర్విభజన జరగాలి.. తదితర అంశాలపై సీజీజీ నివేదిక సమర్పించనుంది. ఈ రిపోర్టును బల్దియా సర్కారుకు పంపుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News