Chennai: కంచి మఠం ఉత్తరాధికారిగా గణేశ శర్మ
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:01 AM
తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ద్రావిడ్ నియమితులయ్యారు.

అన్నవరం రుగ్వేద పండితుడికి అవకాశం
చెన్నై/అన్నవరం/బాసర, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని సుప్రసిద్ధ శంకర మఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన గణేశ శర్మ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్‌కు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్షను ఇస్తారని కంచి శంకర మఠం శ్రీకార్యం (మేనేజర్) చల్లా విశ్వనాథ శాస్త్రి శుక్రవారం తెలిపారు. అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులుగా పనిచేస్తున్న దుడ్డు ధన్వంతరీ, మంగాదేవి దంపతులకు 2000 ఏప్రిల్ 24న గణేశ శర్మ జన్మించారు. తల్లి గృహిణి. గణేష శర్మ తన ఆరో ఏటనే రత్నాకర భట్టు వద్ద రుగ్వేదం అభ్యసించి, నిష్ణాతులయ్యారు. అనంతరం తెలంగాణలోని బాసర జ్ఞానసరస్వతి దేవస్థానంలో పండితుడిగా వ్యవహరించారు.
ఆ సమయంలో బాసర పర్యటనకు వచ్చిన కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆయనను శంకర మఠానికి తీసుకెళ్లారు. అక్కడ తర్కం, మీమాంసతో పాటు సామవేదం, యజుర్వేదంలో స్వామీజీ స్వయంగా శిక్షణ ఇచ్చారు. కంచి మఠానికి ప్రస్తుతం విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా ఉంటున్నారు. 2018 జనవరి 28న జయేంద్ర సరస్వతి మహాసమాధి చెందడంతో అప్పట్లో యువ పీఠాధిపతిగా ఉన్న విజయేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆరేళ్ల పాటు ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. కాగా, సన్యాస దీక్ష స్వీకరించిన అనంతరం మే 2న కంచి మఠంలో జరిగే ఆదిశంకర జయంతి ఉత్సవాల్లో విజయేంద్ర సరస్వతితో పాటు యువ పీఠాధిపతి కూడా పాల్గొంటారని మఠం నిర్వాహకులు వెల్లడించారు.