Share News

TG News: ఆదివాసీల ఆత్మగౌరవ పతాక.. ఇంట్లోనే లడ్డూలు, బిస్కెట్లలాంటి..

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:11 PM

అడవుల్లో విస్తారంగా పెరిగే ఇప్ప చెట్ల మీద పూలను మేం తాకం. అవి కింద రాలిపోయిన తరువాతనే ఏరుకుంటాం. చెట్లమీద పూలను తాకితే పులి వస్తుందని మా గోండు గిరిజనులు గట్టిగా నమ్ముతారు. అందుకే కట్టెతో కూడా వాటిని ముట్టుకోరు’’ అంటాడు ఆదిలాబాద్‌ జిల్లా, ఉట్నూరులో ‘ఆదివాసీ ఆహార కేంద్రం’ నిర్వహిస్తున్న కుమ్రా విఠల్‌రావు.

TG News: ఆదివాసీల ఆత్మగౌరవ పతాక.. ఇంట్లోనే లడ్డూలు, బిస్కెట్లలాంటి..

పిల్లలకు చాక్లెట్‌ కొనడానికి కూడా స్తోమత లేని ఆ గిరిజన మహిళలు... ఇంట్లోనే లడ్డూలు, బిస్కెట్లులాంటి చిరుతిళ్లు తయారుచేసేవారు. అడవిలో దొరికే ఆకులు, పువ్వులతో సబ్బులు చేసేవారు. ఆశ్చర్యంగా అవే ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీపడుతున్నాయి. అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణ గిరిజన మహిళల స్వయం కృషి... ఈరోజు వారికో ఆదాయ మార్గాన్ని చూపింది. ఈ గొప్ప మార్పు ఎలా జరిగింది?...

బిడ్డలకు బిస్కెట్లు, చాక్లెట్లు కొనివ్వలేని పేదరికమే... ఆ మహిళలను అరుదైన ఉత్పత్తుల ఆవిష్కర్తలుగా మార్చింది. మార్కెట్లో ఖరీదైన సబ్బులు, షాంపూల అవసరమే వారిని వ్యాపారవేత్తలుగా మార్చింది. అడవుల్లో దొరికే వనరులే వారి వ్యాపారానికి ముడిసరుకు. సాధించాలనే లక్ష్యమే వారి పెట్టుబడి. సీన్‌ కట్‌ చేస్తే... వారి ఉత్పత్తులు దేశవిదేశాలకు ఎగుమతి అవ్వడమే కాదు... వారి స్వయంకృషి, విజయాన్ని చూసి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు.

ఆదివాసీ మహిళా సహకార సంఘం

‘‘అడవుల్లో విస్తారంగా పెరిగే ఇప్ప చెట్ల మీద పూలను మేం తాకం. అవి కింద రాలిపోయిన తరువాతనే ఏరుకుంటాం. చెట్లమీద పూలను తాకితే పులి వస్తుందని మా గోండు గిరిజనులు గట్టిగా నమ్ముతారు. అందుకే కట్టెతో కూడా వాటిని ముట్టుకోరు’’ అంటాడు ఆదిలాబాద్‌ జిల్లా, ఉట్నూరులో ‘ఆదివాసీ ఆహార కేంద్రం’ నిర్వహిస్తున్న కుమ్రా విఠల్‌రావు.


book11.jpg

ఈ అటవీ ప్రాంతంలో ఏటా క్వింటాళ్ల కొద్దీ ఇప్పపూలు రాలిపోతుంటాయి. కొందరు వాటిని సేకరించినా ఎక్కువ శాతం వృథా అవుతాయి. విలువైన ఈ అటవీ ఉత్పత్తి నుంచి అడవిబిడ్డల ఆదాయం పెంచాలనే ఆలోచనతో అప్పటి (2020) ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యా దేవరాజన్‌ ఉట్నూరులో కొంత స్థలం కేటాయించి 12 మంది మహిళలతో ‘భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం’ ఏర్పాటు చేశారు. ‘‘మాకు ఆర్ధిక సహాయం అందించడమే కాక, ఇప్పపూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో జార్ఖండ్‌కు శిక్షణ కోసం పంపించి, ఆహార పదార్థాల తయారీకి అవసరమైన యంత్రాలను కూడా సమకూర్చడంతో... తెలంగాణలో తొలి ఇప్పపువ్వు లడ్డూ కేంద్రంగా పేరు వచ్చింది’’ అన్నారు అధ్యక్షురాలు కుమ్ర భాగుబాయి.

ఈ కేంద్రంలో ఇప్పపూల లడ్డూలు, జ్యూస్‌ తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్‌, కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లాల్లో 2,600 మంది గిరిజన గర్భిణులకు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు.


book11.3.jpg

పుంగార్‌ చాక్లెట్లు, బర్ఫీలు...

‘అందరిలాగే మా పిల్లలు కూడా చాక్లెట్లు, బిస్కెట్లు కొని పెట్టమంటారు. మార్కెట్‌లో దొరికే ఖరీదైన చాక్లెట్లు కొనే స్తోమత మాకు లేదు. అయితే వారి ఆరోగ్యాన్ని కాపాడి, పోషక విలువలు పెంచే చిరుతిండి పెట్టాలని నిర్ణయించుకున్నాం. అడవిలో సహజంగాదొరికే ఇప్పపువ్వుతో చాక్లెట్లు తయారు చేయాలని నిర్ణయించాం. ఇదే విషయం ఐటిడిఎ అధికారు లకు చెబితే... మాకు ట్రైనింగ్‌ కూడా ఇప్పిం చారు. అలా ఇప్పపూవు చాక్లెట్‌లు మా పిల్లల కోసం తయారుచేయడం మొదలు పెట్టినా... ఆ తర్వాత దాన్ని వ్యాపారంగా మార్చుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి’ అన్నారు భద్రాచలం(Bhadrachalam)లో ఇప్పపువ్వు చాక్లెట్లు, బర్ఫీ చేస్తున్న సమ్మక్క. ఈ ఉత్పత్తులకు ‘పుంగార్‌ చాక్లెట్లు’ అనే పేరు పెట్టారు. పుంగార్‌ అంటే కోయభాషలో పువ్వు అని అర్థం.


book11.2.jpg

చాక్లెట్‌ల తయారీ కోసం ముందుగా అడవుల్లో ఇప్పపువ్వును సేకరిస్తారు. పూలను ఆరుబయట ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని వేయిస్తారు. అరకిలో చాక్లెట్ల తయారీకి 200 గ్రాముల ఇప్పపువ్వు, 100 గ్రాముల బెల్లం, 90 గ్రాముల పల్లీలు, 90 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్‌, నెయ్యి కలిపి తయారు చేస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. వీటికి తోడు ఎండు ద్రాక్ష, యాలకులు, మిరియాల పొడి కలిపి చిన్న ఉండలుగా చుట్టి చాక్లెట్‌లు తయారు చేస్తున్నారు. ‘ఇప్పవువ్వు చాక్లెట్లు తినడం వల్ల పిల్లలు, మహిళల్లో రక్తహీనత తగ్గుతుంద’ని ఆహార నిపుణులు అంటున్నారు.


అవిసె గింజలతో బిస్కెట్లు ...

‘‘ఇవన్నీ మామూలుగా మైదాతో చేసిన బిస్కెట్లు కాదు... కొర్రలు, సామలు, రాగులు, అవిసె గింజలతో చేసిన బిస్కెట్లు. వీటితో పిల్లల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం’’ అంటారు భద్రాచలానికి చెందిన వెంకటలక్ష్మి.

స్వయం సహాయక బృందం సభ్యులైన కొంతమంది మహిళలు ‘ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ’ ద్వారా శిక్షణ పొంది, ‘భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌ బ్రాండ్‌’తో చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. ఈ బిస్కెట్లను హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు, లండన్‌కు సరఫరా చేస్తున్నారు. స్థానికంగా సాగుచేసే చిరుధాన్యాలు, ఆర్గానిక్‌ బెల్లం, తేనె, నెయ్యితో బిస్కెట్లు తయారు చేస్తున్నారు.


వెదురు, ఇప్పపువ్వు సబ్బులు...

భద్రాచలంలో వ్యవసాయ కూలీ విజయలక్ష్మి. టెన్త్‌ వరకే చదివింది. తనతో పాటు పదిమంది మహిళలను కలుపుకొని ‘దమ్మక్క మహిళా సంఘం’గా ఏర్పడి, ఐటీడీఎ అధికారులను కలిసి, ‘స్వయం ఉపాధికి మార్గం చూపండి’ అని కోరారు. వారు సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడమేకాక మార్కెటింగ్‌ మెలకువలు నేర్పారు. విజయలక్ష్మి తన టీమ్‌తో కలిసి భద్రాచలంలో యూనిట్‌ నిర్వహిస్తున్నారు. అలోవెరాతో రకరకాల సబ్బులు, షాంపూలు తయారు చేయడమే కాక వేప, తులసి, వెదురు, ఇప్పపువ్వు, బొప్పాయి ఫ్లేవర్‌తో సబ్బులు తయారు చేస్తున్నారు.


‘మొత్తం పెట్టుబడి రూ. 25 లక్షలు దీనిలో 30 శాతం మా గ్రూప్‌ సభ్యులం భరించాం, మార్కెటింగ్‌లో ఐటీడీఎ అధికారులు మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వనరులతో తయారుచేస్తున్న ఆయుర్వేదిక్‌ సబ్బులను తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఏపీ, తమిళనాడు సహా లండన్‌కి కూడా మా ఉత్పత్తులు వెళ్తున్నాయి. ఉత్పత్తుల్లో నాణ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏడాది 2 లక్షల సబ్బులను కొనుగోలు చేసి గిరిజన గురుకుల విద్యార్థులకు సరఫరా చేస్తోంది. ఈ ఒక్క ఒప్పందమే నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు వ్యవసాయ కూలీలుగా ఉన్న మేము ఇప్పుడు వ్యాపార వేత్తలుగా మారాం. ఈ ‘ట్రైబల్‌ బ్లిస్‌’ సబ్బులు పరిశుభ్రమైన వాతావరణంలో కెమికల్‌ ఫ్రీ, ఎకో- ఫ్రెండ్లీగా తయారు చేశామ’ని విజయలక్ష్మి చెప్పారు.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి ఉత్పత్తులను ప్రశంసించారు. మిల్లెట్‌ బిస్కెట్లు, ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేస్తున్న ఆదివాసీ మహిళల కృషిని ప్రధానమంత్రి మోదీ ‘మన్‌ కీ బాత్‌‘ కార్యక్రమంలో అభినందించారు. ఇదంతా వారి స్వయం ఉపాధికి ఉదాహరణ మాత్రమే కాదు... వారి ఆత్మవిశ్వాసం, స్వావలంబనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది ఆదివాసీల ఆత్మగౌరవ పతాక.

- శ్యాంమోహన్‌, 94405 95858


ఈ వార్తలు కూడా చదవండి..

పైన రోడ్డు... కింద హోటల్‌...

కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్, గుడ్డు రేట్లు అమాంతం పెరిగాయి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 23 , 2025 | 01:21 PM