Share News

డోలీ పోయి.. ట్రాలీ వచ్చె...

ABN , Publish Date - May 04 , 2025 | 12:14 PM

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో ఆయన మోటార్‌ మెకానిక్‌. కేవలం పదో తరగతి వరకే చదివారు. చదువు కొనసాగించడంలో ఎదురైన అనేక అడ్డంకులు ఆయన ఆవిష్కరణ పటిమకు అడ్డంకి కాలేదు.

డోలీ పోయి.. ట్రాలీ వచ్చె...

ఆ పూరింట్లో నుంచి భరించలేని నొప్పులతో నెలలు నిండిన మహిళ హృదయ విదారకంగా అరుస్తోంది. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంబులెన్స్‌ రావడానికి ఆ కొండ మీదకు సరైన దారి కూడా లేదు. కాలిబాట తప్ప మరోదారి లేదు. గ్రామస్తులే డోలీ కట్టుకొని బయలు దేరారు. ఆసుపత్రికి చేరేలోపు... ఆ ఎగుడు దిగుడు దారిలో డోలీ మోసేవారు చాలా ఇబ్బందులు పడసాగారు. చివరికి దారిలోనే ఆమె ప్రసవిం చింది. కొండ ప్రాంతాల్లో అప్పుడప్పుడు జరిగే ఇలాంటి సంఘటనలు మీడియాలో చూసి చలించిపోయారు షణ్ముఖరావు. ‘అయ్యో’ అని అందరిలాగే జాలి పడి మిన్నకుండలేక, పరిష్కారం దిశగా ఆలోచించారు. ఫలితమే సరికొత్త ‘డోలీ అంబులెన్స్‌’...


‘నాకు ఒక్క రూపాయి లాభం కూడా వద్దు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల ప్రజలకు ఈ డోలీ అంబులెన్స్‌ అందుబాటులో ఉండి... వారి ప్రాణాలు కాపాడితే చాలు’ అంటారు రేపల్లె షణ్ముఖరావు.

book8.2.jpg

తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా, కంబాలపల్లి గ్రామంలో ఆయన మోటార్‌ మెకానిక్‌. కేవలం పదో తరగతి వరకే చదివారు. చదువు కొనసాగించడంలో ఎదురైన అనేక అడ్డంకులు ఆయన ఆవిష్కరణ పటిమకు అడ్డంకి కాలేదు. అద్భుతమైన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో గ్రామీణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక యంత్రాలను అభివృద్ధి చేశారాయన. అవన్నీ వ్యవసాయ ఖర్చులను తగ్గించడమేగాక, మానవ శ్రమను సులభతరం చేస్తున్నాయి. ఐఐటీ నిపుణులతో పోటీ పడుతూ జాతీయ స్థాయి ఇన్నోవేటర్‌గా గుర్తింపు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.


‘అటవీ ప్రాంతాల్లో కొన్ని చోట్ల కేవలం కాలిబాట మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు మోటార్‌ బైక్‌ కూడా వెళ్లడం కష్టమే. దారంతా వాగులు వంకలు, రాళ్లు, ఎత్తుపల్లాలుగా ఉంటుంది. అలాంటి చోట అనారోగ్యంతో బాధపడే 70 నుంచి 80 కిలోల బరువున్న మనిషిని డోలీలో భుజాలపై మోస్తూ వెళ్లడం ఒకరకంగా అసాధ్యమే. ఎగుడు దిగుడు రహదారుల్లో అడుగులు వేయడం చాలా కష్టం. ఈ శ్రమను చాలాకాలంగా చూస్తున్నా. వాళ్ల శ్రమను తగ్గించి రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చాలనే తపనతో డోలీ అంబులెన్స్‌కు రూపకల్పన చేశా’ అన్నారు షణ్ముఖరావు.

book8.3.jpg


ఎలా పనిచేస్తుంది?

మామూలుగా గిరిజనులు వాడే డోలీకి కొద్దిగా మార్పులు చేసి, డోలీకి ఉండే కర్ర స్థానంలో తేలికపాటి ఇనుప పైప్‌ను తీసుకొని.. దానికి రెండు నిలువు పైపులను పెట్టి, వాటికి చక్రాలను అమర్చారు. పైపునకు మధ్యలో డోలీ కట్టి, అందులో రోగిని కూర్చోబెట్టుకొని, మోసే భారం లేకుండా చక్రాల ద్వారా నెట్టుకుంటూ వెళ్తారు. రాళ్లు అడ్డు వచ్చి డోలీ తోయాల్సిన పరిస్ధితి లేనపుడు చక్రాలు పైకి వచ్చేలా అమర్చుకొని మోసుకొని వెళ్తారు. దారి బాగున్నపుడు చక్రాలను కిందికి దించుకొని తోసుకుంటూ వెళ్తారు.


ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రోగిని ఆసుపత్రికి చేర్చడానికి వీలుగా రోగికి, దానిని తోసుకుంటూ వెళ్లేవారికి ఎండా వానల నుంచి రక్షణకు డోలీకి గొడుగులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు... రాత్రివేళలో వెళ్లాల్సి వస్తే దారి కనపడడానికి సోలార్‌ సహాయంతో పనిచేసే లైట్‌ కూడా పెట్టారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే రోగికి అవసరమైన ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ కోసం ఒక అర కూడా ఇందులో ఉంటుంది.

‘రహదారులు లేని ప్రతీ మారుమూల గ్రామాలలో ఇలాంటి డోలీలను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రెండు మూడు ఏర్పాటు చేయగలిగితే... చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఎవరైనా అలా ముందుకు వస్తే, పైసా లాభం ఆశించకుండా వాటిని తయారు చేసి ఇస్తాను’ అంటున్నాడు షణ్ముఖరావు. రూ.5 వేలకే ఆయన డోలీ అంబులెన్స్‌ తయారు చేసి ఇస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలకు ‘డోలీ అంబులెన్స్‌’ కొత్త వెలుగు!

- శ్యాంమోహన్‌,

94405 95858


సరికొత్త ఆవిష్కరణలు...

‘డోలీ అంబులెన్స్‌’తో పాటు గత దశాబ్దకాలంగా రైతుల కష్టాలు తీర్చే అనేక ఆవిష్కరణలు చేశారు షణ్ముఖ రావు. మిరప, పత్తి, కూరగాయల పొలాల్లో పనిచేసేవారికి మండే ఎండలు పెద్ద ఇబ్బంది. ఈ కష్టాలు తీర్చడానికి పొలంలో పక్క పక్క సాళ్లలో పదిమందికి నీడనిచ్చే చక్రాలతో ఉన్న ‘కమ్యూనిటీ గొడుగు’ను తయారు చేశారు. దానిని అవసరం మేరకు ముందుకు వెనక్కు జరుపుకొంటూ పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రైతు కూలీలు వంగి కలుపు తీసే శ్రమను తగ్గించడానికి సులువుగా కూర్చొని నడిపే ‘మోనో వీల్‌ వీడర్‌’ని రూపొందించారు. సోలార్‌ పవర్‌తో పనిచేసే మరో వీడర్‌, నాట్లు వేసే యంత్రం, బ్రష్‌ కట్టర్‌, సోలార్‌ పవర్‌తో గంటకు 5 కిలోమీటర్ల రహదారిని శుభ్రం చేసే రోడ్డు క్లీనర్‌ కూడా తయారు చేశారు. ప్రస్తుతం షణ్ముఖరావు వరినాట్లు వేసే యంత్రం తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అండ

Read Latest Telangana News and National News

Updated Date - May 04 , 2025 | 12:14 PM