Share News

Cancer Screening: క్యాన్సర్‌ పరీక్షలు ఫ్రీ

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:34 AM

రాచపుండు.. క్యాన్సర్‌..! పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి.

Cancer Screening: క్యాన్సర్‌ పరీక్షలు ఫ్రీ

18 ఏళ్లు దాటిన వారందరికీ.. సర్కారు నిర్ణయం

  • మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌

  • మగవారిలో నోటి క్యాన్సర్‌ పరీక్షలు

  • గ్రామగ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం

  • పది క్యాన్సర్‌ ప్రాంతీయ కేంద్రాలు

  • జిల్లాకో మొబైల్‌ స్ర్కీనింగ్‌ వాహనం

  • ఏటా 20 శాతం జనాభాకు పరీక్షలు

  • ఐదేళ్లలో 100ు జనాభాకు అవకాశం

  • ప్రస్తుతం హైదరాబాద్‌లోనే స్ర్కీనింగ్‌

  • తాజా నిర్ణయంతో గ్రామాలకూ సేవలు

  • ప్రపంచ బ్యాంకు నిధులతో కార్యక్రమం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాచపుండు.. క్యాన్సర్‌..! పేరు ఏదైనా ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో అగ్రస్థానంలో ఉంది. ఏటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక్క ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నెలకు సగటున వెయ్యి కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49,166గా ఉంది. చాలా మందిలో క్యాన్సర్‌ లక్షణాలు కనిపించకుండా.. బాగా ముదిరి, చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతోంది. ఈ దశలో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా.. ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్‌ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసుల్లో 41ు వరకు ఓరల్‌, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రోగులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ మూడు కేటగిరీలపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించనుంది. అయితే.. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. క్యాన్సర్‌ పరీక్షల కోసం ప్రభుత్వం పది ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసి, జిల్లాకు ఒకటి చొప్పున ‘మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌’ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రాంతీయ కేంద్రాలను రెండు దశల్లో ప్రారంభించనుంది. మొదటి దశలో భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కోచోట రూ.50 కోట్ల చొప్పున వెచ్చించి, ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తదుపరి దశలో మరో ఐదు చోట్ల ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్‌కు మెడికల్‌, సర్జికల్‌, రేడియో థెరపీ సేవలందిస్తారు. దీంతోపాటు.. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఇక్కడ కీమోథెరపీ, పాలియేటివ్‌ కేర్‌ సేవలందిస్తారు. దీంతోపాటు.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్‌ వాహనం సేవలను ప్రవేశపెడతారు. ఈ వాహనంలో ఆంకాలజిస్టులు, పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు.


ప్రతి గ్రామంలో స్ర్కీనింగ్స్‌

ప్రాంతీయ, జిల్లా క్యాన్సర్‌ కేంద్రాలకు అనుబంధంగా పనిచేసే మొబైల్‌ వాహనాలు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాయి. ముందుగానే నిర్ణీత గ్రామంలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షల తేదీలను ప్రకటిస్తారు. కంటివెలుగు మాదిరిగానే.. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తారు. సర్జరీలు అవసరమైతే ప్రాంతీయ కేంద్రాలకు.. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి సిఫారసు చేస్తారు. వీటితోపాటు.. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఒక క్యాన్సర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారు.


మహిళలకు ప్రత్యేకంగా..

మహిళలకు అన్ని సర్కారీ దవాఖానాల్లో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తారు. ఇప్పటికే ‘ఆరోగ్య మహిళ’ పేరుతో మంగళవారాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

పరీక్షలకు ప్రపంచ బ్యాంకు నిధులు..

క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల కోసం ప్రపంచ బ్యాంకు నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖకు ప్రపంచ బ్యాంకు క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలకు గాను.. ఆరేళ్ల ప్రాజెక్టులో భాగంగా రూ.4,150 కోట్ల రుణం ఇవ్వనుంది. క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలకు సంబంధించి ప్లానింగ్‌ రిపోర్టును ప్రపంచ బ్యాంకు బృందానికి వైద్యశాఖ ఇప్పటికే అందజేసింది. ఈ నిధులు వస్తే.. పరీక్షల కోసం జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అందులో వైద్య పరీక్షలు చేసే వైద్యులు, ఇతర సహయక సిబ్బందితోపాటు యంత్ర పరికరాలుంటాయి. ప్రాంతీయ, జిల్లాస్థాయి కేంద్రాలు ఏర్పాటైతే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన క్యాన్సర్‌ పరీక్షలు, చికిత్సలు.. జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. మొబైల్‌ వాహనాల ద్వారా గ్రామగ్రామానికీ సేవలు అందుతాయి.


‘మొబైల్‌’ ద్వారా రోజుకు 200 మందికి..

మొబైల్‌ వాహనం ద్వారా రోజుకు కనీసం 200 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొ వాహనంలో 12 మంది వైద్య సిబ్బంది ఉంటారు. వీరిలో నలుగురు ఆంకాలజిస్టులు కాగా.. మిగతా వారు పారా మెడికల్‌ సిబ్బంది. మహిళలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల కోసం పాప్‌స్మియర్‌ పరికరం, రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మోమోగ్రఫీ యంత్రాలుంటాయి. ఓరల్‌ క్యాన్సర్‌ విషయంలో టార్చ్‌లైట్‌ సాయంతో మౌఖికంగా పరీక్షించి, నిర్ధారించవచ్చు.

- డాక్టర్‌ ఎం.శ్రీనివాసులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌

ఈ మూడు క్యాన్సర్లే ఎక్కువ

ఎంఎన్‌జే ఆస్పత్రిలో నమోదవుతున్న

కొత్త కేసుల్లో ఓరల్‌, రొమ్ము, గర్భాశయ

ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడ్డ వారే అధికంగా ఉంటున్నారు. కేటగిరీల వారీగా ఆ వివరాలు..

నోటి క్యాన్సర్‌ 19%

రొమ్ము క్యాన్సర్‌ 12%

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 10%

మొత్తం 41%


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 07:00 AM