Share News

Scam: ఉద్యోగాల పేరిట దందా!

ABN , Publish Date - Jan 23 , 2025 | 03:54 AM

ఉద్యోగాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా విషయం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

Scam: ఉద్యోగాల పేరిట దందా!

  • చండీగఢ్‌లో భారీ మోసం

  • తెలుగు యువతీయువకులే టార్గెట్‌

ఖమ్మం క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా విషయం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌ రాష్ట్రంలోని మొహాలీ కేంద్రంగా బార్‌కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ క్రియేషన్స్‌లో ఉద్యోగాల పేరుతో కొందరు అక్కడ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల వారిని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎరవేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్టులను చూసి తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లిన యువతీయువకులు మోసపోయి తిరిగి వస్తున్నారు. ఉచితంగా జాబ్‌ ఇస్తామని చెప్పి అక్కడికి రప్పించిన తర్వాత ఐదు రోజుల శిక్షణపేరుతో రూ.3 వేలు గుంజుతున్నారు. అది పూర్తయిన తర్వాత రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నవారిని బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇబ్బందులు తట్టుకోలేక ఎవరైనా రూ.70 వేలు చెల్లించినా.. గొలుసుకట్టు తరహాలో మరో ఐదుగురి చేత రూ.70 వేలు కట్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా డబ్బు కట్టిస్తే ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు కమీషన్‌గా చెల్లిస్తామని చెబుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కొట్టడం, బంధించడం వంటివి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది ఇందులో ఇరుక్కున్నారు. వారిలో కొంతమంది అక్కడినుంచి పారిపోయి బుధవారం రాత్రి ఖమ్మం చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - Jan 23 , 2025 | 03:54 AM