Share News

మిలిటరీ కాలేజీలోకి నలుగురు ఆగంతకులు

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:48 AM

ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.

మిలిటరీ కాలేజీలోకి నలుగురు ఆగంతకులు

  • నకిలీ ఐడీలతో చొరబాటుకు ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళల యత్నం

  • వారిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది

  • పోలీసులకు అప్పంగిత.. రిమాండ్‌

తిరుమలగిరి/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారం తిరుమలగిరిలో ఆర్మీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని ఎంసీఈఎంఈ (మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌) మిలటరీ కాలేజీలోకి శుక్రవారం ఉదయం నలుగురు ఆగంతకులు అక్రమంగా ప్రవేశించారు. వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు వారిని ప్రశ్నించారు. దీంతో తాము ఎయిర్‌ఫోర్స్‌ అధికారులం అంటూ నలుగురు ఐడీ కార్డులు చూపించారు. వాటిని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు పంపగా.. అవి నకిలీవని తేలడంతో తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎయిర్‌ఫోర్స్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అన్ని కోణాల్లో విచారించారు. ఆ నలుగురిపై తిరుమలగిరి పీఎ్‌సలో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తామని..!

కాలేజీ లోపలికి ప్రవేశించిన ఆగంతకులను రాకేష్‌ కుమార్‌, ఆశిష్‌ కుమార్‌, ఆలియా అబ్జీ, నగ్మభానూగా పోలీసులు గుర్తించారు. వారిలో యువకులు టీషర్ట్‌లు ధరించి ఉండగా.. మహిళల్లో ఒకరు బురఖా, మరొకరు సాధారణ డ్రస్‌ ధరించి ఉన్నారు. ఇద్దరు యువకులది బిహార్‌ కాగా.. మహిళలది మహారాష్ట్రగా తేలినట్లు సమాచారం. ఆ ఇద్దరు యువకులు ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు మహిళలు పరిచయం అయ్యారు. వారికి మిలటరీ క్యాంటీన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రాకేష్‌ కుమార్‌ ట్రాప్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. మహిళలను నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఆర్మీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఆర్మీ ప్రాంతంలోకి నలుగురు వ్యక్తులు అక్రమంగా చొరబడిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 04:48 AM