CR Naidu: ఆదర్శప్రాయుడు సీఆర్ నాయుడు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:53 AM
విశ్రాంత ఐపీఎస్ అధికారి సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండమెట్లు’ పుస్తకం యువతరానికి ప్రేరణగా నిలుస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు.

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. విశ్రాంత ఐపీఎస్ సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండమెట్లు’ పుస్తకావిష్కరణ
పాల్గొన్న సుప్రీం మాజీ సీజే ఎన్వీ రమణ, ఏపీ మాజీ డీజీపీ దొర తదితరులు
సీఆర్ నాయుడును సత్కరించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐపీఎస్ అధికారి సీఆర్ నాయుడు ఆత్మకథ ‘కొండమెట్లు’ పుస్తకం యువతరానికి ప్రేరణగా నిలుస్తుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కొనియాడారు. చిత్తూరు జిల్లా మారుమూల పల్లెల్లో పుట్టిన ఆయన పోలీసు అధికారి కావాలన్న ఇష్టంతో కష్టపడి లక్ష్యాన్ని సాధించిన తీరు అభినందనీయమన్నారు. క్యాప్ సంస్థ ద్వారా సీఆర్ నాయుడు నిర్వహిస్తున్న జీవన నైపుణ్యాల శిక్షణ వంటి సేవాకార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విశ్రాంత ఐపీఎస్, పారిశ్రామికవేత్త చేరెడ్డి రామచంద్రయ్య నాయుడు (సీఆర్ నాయుడు) ఆత్మకథ ‘కొండమెట్లు’ పుస్తకాన్ని బుధవారం మాదాపూర్‌లోని దస్‌పల్లా హోటల్లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
జీవిత భాగస్వామి వల్లే ఇన్నిమెట్లు ఎక్కగలిగా: సీఆర్ నాయుడు
పుస్తక రచయిత సీఆర్ నాయుడు మాట్లాడుతూ... కమ్యూనిటీ పోలీసింగ్, మైత్రి ప్రాజెక్టులను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లడం తన జీవితంలో ఒక మర్చిపోలేని మధురానుభూతులని తెలిపారు. తన జీవిత భాగస్వామి శశికళ సహకారం వల్లే జీవితంలో ఇన్నిమెట్లు ఎక్కగలిగానంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సీఆర్ నాయుడును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జె దొర, కె. పద్మనాభయ్య, మహేందర్ రెడ్డి, గౌతం సవాంగ్, ఆర్పీ సింగ్, వీకే మొహంతి తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీనియర్ ఐఏఎస్ కె. లక్ష్మీనారాయణ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు ఉద్యోగానికి పనికొస్తాడనుకోలేదు: ఎన్వీ రమణ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘సీఆర్ నాయుడు ను మొదట చూసినప్పుడు, ఇతను పోలీసు ఉద్యోగానికి పనికొస్తాడా? అన్న సందేహం కలిగేది. పోలీసు అధికారిగా ఆయన కమ్యూనిటీ పోలీసింగ్, బాల కార్మికుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించడంలాంటి ఎన్నో కొత్త విధానలు ప్రవేశపెట్టడం చూసి తర్వాత నా అభిప్రాయం పూర్తిగా తప్పు అని నిర్ధారించుకున్నాను’’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..